పలువురు భక్తులపై విరిగిన లాఠీ
● పనిచేయని వీవీఐపీ
పాస్‌లు
● కమాండ్ కంట్రోల్ టు
గద్దెలు
● పని కొందరిది..పెత్తనం అందరిదన్న విమర్శలు..
వరంగల్ క్రైం: మేడారం మహాజాతర ఈ ‘సారీ’ పోలీస్ జాతరగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పోలీసులు జాతరను సామాన్య భక్తులకు అందనంత దూరం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా పూజారులే పోలీసుల మీద దాడులకు పాల్పడడం ఇందుకు నిదర్శనమని అంటున్నారు. మహా జాతరకు 13 వేల మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తారని అధికారులు ప్రకటించారు. ఒక్కో ఐపీఎస్ అధికారి వెంట 10 నుంచి 20 మంది కానిస్టేబుళ్లు లాఠీలతో ప్రదర్శన చేశారని, సామాన్యులను పట్టించుకోలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. తల్లుల సేవలో కంటే ప్రజా ప్రతినిధులు, వారి ఉన్నతాధికారుల సేవలోనే తరించిపోయారన్న విమర్శలున్నాయి. కమాండ్ కంట్రోల్ కాస్త పోలీసుల విడిది కేంద్రంగా మారిందని కొందరు ఆరోపిస్తున్నారు. జంపన్న వాగు నుంచి గద్దెల వరకు సైరన్ల మోతతో విసుగుచెందిన భక్తులు ఏకంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కాన్వాయ్‌పై దాడికి దిగడం చర్చనీయాంశమైంది.
కమాండ్ కంట్రోల్ టు గద్దెలు..
సామాన్య భక్తులు, ఇతర శాఖల అధికారులకు దర్శనాలకు అవస్థలు పడ్డారని, కానీ కానిస్టేబుల్ నుంచి డీఐజీ వరకు పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రం తల్లుల దర్శనానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గద్దెల వద్ద గతంలో కలెక్టర్ పర్యవేక్షణ చేసి అధికారులకు సలహాలు చేసేవారు. కానీ, ఈసారి పర్యవేక్షణ కలెక్టర్ కంట్రోల్ నుంచి పోలీసుల చేతుల్లోకి వెళ్లిందనే విమర్శలు వినిపించాయి. కొందరు అధికారుల అతి, అత్యుత్సాహానికి ములుగు ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్ సైతం నొచ్చుకున్నట్లు తెలిసింది. దీంతో అప్పగించిన విధులను కొంతమంది నిజాయితీగా నిర్వర్తించినా.. మిగతా వారి అతితో మొత్తం పోలీసులకే చెడ్డపేరు తప్పలేదని అంటున్నారు.
13 కిలోమీటర్లు.. నాలుగున్నర గంటలు
శుక్రవారం తాడ్వాయి నుంచి మేడారం రావడానికి నాలుగున్నర గంటల సమయం పట్టింది. కేవలం వీఐపీల వాహనాల కోసం అధికారులు తీసుకున్న నిర్ణయాలతో భక్తులు ఇబ్బందులు పడ్డారని చెబుతున్నారు. అన్ని క్యూలైన్ల మాదిరిగానే వీవీఐపీ, వీఐపీ లైన్ల మారడంతో పాస్‌లు ఎందుకిచ్చారు.. ఎందుకు గాలికొదిలేశారంటూ పలువురు భక్తులు మండిపడ్డారు. పోలీసుల తీరును ప్రశ్నించిన ఓ భక్తుడిపై ఓ ఏఎస్పీ, ఓ సీఐ చేసిన దాడి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. హెలిపాడ్ మార్గంలో పోలీస్ కుటుంబాల పేరిట ఇష్టారాజ్యంగా భక్తులను వదలడంతో దర్శనం గందరగోళంగా మారినట్లు చెబుతున్నారు.


