‘లింక్ కెనాల్’ సర్వే అడ్డగింత
గార్ల: మండలంలోని దుబ్బగూడెం సమీపంలో మున్నేరు నుంచి పాలేరుకు నీటిని తరలించే లింక్ కెనాల్ నిర్మాణ సర్వేకు వచ్చిన అధికారులను రైతులు, ఉద్యమకారులు అడ్డుకున్నారు. సర్వే నిలిపివేయాలని రైతులు, మున్నేరు జలసాధన కమిటీ సభ్యులు గంటపాటు నినాదాలు చేశారు. అనంతరం మున్నేరు జలసాధన కమిటీ కన్వీనర్ గంగావత్ లక్ష్మణ్‌నాయక్ మాట్లాడారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రైతుల భూములు ఎలా సర్వే చేస్తారని తహసీల్దార్‌ను నిలదీశారు. గార్ల మండలానికి చుక్కనీరు ఇవ్వకుండా లింక్ కెనాల్ ద్వారా పాలేరుకు నీళ్లు తరలిస్తే రైతులతో కలిసి ఉద్యమం ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. స్థానిక రైతులకు సాగునీరు అందించేందుకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే లింక్ కెనాల్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, గిరిజన రైతు చిన్న తనకున్న 30గుంటల భూమి లింక్ కెనాల్‌లో పోతు ందని, మేము ఎలా బతకాలని రోదిస్తూ డీఎస్పీ కాళ్లు పట్టుకోబోగా, పోలీసులు ఆయనను వారించారు. ఈక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు జోక్యం చేసుకొని సర్వే ప్రస్తుతం నిలుపుదల చేస్తున్నామని, భూములు కోల్పోతున్న రైతులతో తహసీల్దార్ మాట్లాడిన తర్వాతే సర్వే చేస్తామని చెప్పడంతో బాధిత రైతులు ఆందోళన విరమించారు. దీంతో సర్వే చేయకుండానే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు. కాగా, ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ ఆధ్వర్యంలో గార్ల–బయ్యారం, డోర్నకల్ సీఐలు, ఎస్సైలు 20మంది సిబ్బందితో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశా రు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కందునూరి శ్రీనివాసరావు, గంగావత్ లక్ష్మణ్‌నాయక్, కట్టెబోయిన శ్రీనివాసరావు, జడ సత్యనారాయణ, సక్రు, జంపాల వెంకన్న, అజ్మీరా వెంకన్న, కత్తి సత్యం, బాధిత రైతులు పాల్గొన్నారు.
మున్నేరు టు పాలేరు లింక్ కెనాల్‌కు మా భూములు ఇచ్చేది లేదు
అధికారులకు తేల్చి చెప్పిన బాధిత రైతులు, ఉద్యమకారులు


