బాలికలకు నాణ్యమైన విద్యనందించాలి
● డీఈఓ రాజేశ్వర్
మహబూబాబాద్ అర్బన్: కేజీబీవీల్లో విద్యార్థినులకు నాణ్యమైన విద్యనందించాల్సిన బాధ్యత స్పెషల్ ఆఫీసర్లపై ఉందని డీఈఓ రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విజ్ఞాన భారతి డిగ్రీ కళాశాలలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, కేర్ టేకర్లకు జాతీయ విద్యాప్రణాళిక పరిపాలన సంస్థ సహకారంతో శిక్షణ నిర్వహించారు. డీఈఓ హాజరై మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను సమర్థవంతంగా వినియోగించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. బాలికలకు వృత్తిపరమైన నైపుణ్యాలతో పాటు వారిలో ఆత్మస్థైర్యం నింపాలన్నారు. అనంతరం జీసీడీఓ విజయకుమారి మాట్లాడుతూ.. జిల్లాలోని 16 కేజీబీవీ వార్డెన్లు, ఐదు బాలికల హాస్టళ్ల కేర్‌టేకర్లు, ములుగు జిల్లాలోని 9 కేజీబీవీ వార్డెన్లు, ఇద్దరు బాలికల హాస్టళ్ల కేర్ టేకర్లకు ఐదురోజుల పాటు శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో మాస్టర్‌ట్రైనర్లు రజిత, మమత, ములుగు, మానుకోట జిల్లాల కేజీవీబీ స్పెషల్ ఆఫీసర్లు, కేర్ టెకర్లు తదితరులు పాల్గొన్నారు.


