ప్రజాస్వామ్యంలో మేము సైతం.. | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యంలో మేము సైతం..

Dec 18 2025 8:54 AM | Updated on Dec 18 2025 8:54 AM

ప్రజా

ప్రజాస్వామ్యంలో మేము సైతం..

గుట్టలు దిగి.. వాగులు దాటి క్రమం తప్పకుండా ఓటేస్తున్న పెనుగోలు గిరిజనులు

వాజేడు: పెనుగోలు.. ఇది పచ్చని అడవి మధ్యలోని ఎత్తైన గుట్టలపై నున్న ఆదివాసీ కుగ్రామం. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల జీపీ పరిధిలో ఉన్న ఈ గూడేనికి రాకపోకలు సాగించాలంటే ఎన్నో వ్యయప్రసాలకు ఓర్చుకుని 3 గుట్టలు ఎక్కి దిగాల్సి ఉంటుంది. అలాగే మూడు వాగులు దాటాలి. 15 కిలో మీటర్లు నడచి రావాలి. ఇక్కడ 10 కుటుంబాలు, 38 మంది జనాభా ఉన్నారు. 25 మంది ఓటర్లు ఉన్నారు. అభివృద్ధికి అందనంత దూరంలో ఉన్నా ఇక్కడి ఆదివాసీలు ఓటు హక్కు వినియోగంలో మైదాన ప్రాంత ప్రజల కంటే చైతన్యవంతులు. ఉన్నత విద్యావంతులతోపాటు రహదారి సౌకర్యం ఉన్న ప్రాంతాల ప్రజలు ఓటు వేయడానికి బద్దకంగా ఉంటున్న ఈ రోజుల్లో పెనుగోలు గిరిజనులు మాత్రం రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును ప్రతీ ఎన్నికల్లో క్రమం తప్పకుండా వినియోగించుకుంటున్నారు. అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీరి బతుకులు మాత్రం మారడం లేదు. ప్రస్తుత జీపీ ఎన్నికల్లోనూ తమ ఓటు వినియోగించుకున్నారు. కొంగాల జీపీ పరిధిలో 18 మంది, నాగారం జీపీ పరిధిలో ఆరుగురు తమ ఓటు హక్కును ఉపయోగించుకోగా బొగ్గుల లక్ష్మికి ఓటు లేకుండా పోయింది.

ఓట్ల కోసమే మమ్ములను వాడుకుంటున్నారు..

ఆయా జీపీల పరిధిలో ఓటు వేసిన అనంతరం పలువురు పెనుగోలు వాసులు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ గోడును పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ కారణంగానే ఎన్నికలకు దూరంగా ఉండాలని అనుకున్నామన్నారు. కానీ రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకోవాలని గుట్టలు దిగొచ్చి ఓటు వేసినట్లు తెలిపారు. కేవలం తమను ఓట్ల కోసం వాడుకుంటూ ఎన్నికల తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం జనాభా లెక్కలు, ఓట్ల కోసం మాత్రమే తమను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. తమకు ఎలాంటి సౌకర్యాలు లేవని తమ గోడువెల్లబోసుకున్నారు.

మౌలిక సదుపాయాలు కల్పించాలి..

పెనుగోలు గ్రామానికి వెళ్లడానికి రహదారి సౌకర్యం లేదు. రాళ్ల దారిలో వాగులు, వంకలు దాటుకుంటూ రాకపోకలు సాగించాల్సిందే. సమీపంలోని పాల వా గు, నల్ల వాగుల నుంచి నీటిని తెచ్చుకుని తాగాల్సి పరిస్థితి. ఇక్కడి వారికి ఏ రోగం, నొప్పి వచ్చినా వైద్యం అందదు. గుట్టల పైనున్న ఈ గ్రామానికి ప్రభుత్వ వైద్యులు రారు. కేవలం ఒక ఏఎన్‌ఎం మాత్రం వచ్చి వెళ్తుంది. దీంతో జ్వర మొచ్చినా, నొప్పి వచ్చినా రోగులు కిందికి రావాలి. వైద్యం కోసం వాజేడు, వెంకటాపురం(కె), భద్రాచలం, వరంగల్‌లోని వైద్య శాలలకు తరలించాల్సి వస్తోంది. ఈ క్రమంలో రోగులను ఆస్పత్రికి తీసుకురావాలంటే అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది. ఈ సమస్యలపై పాలకులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించాలని ఆదివాసీలు వేడుకుంటున్నారు. అలాగే, గుట్టలపై ఉన్న 10 కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లతోపాటు, రెండు ఎకరాల సాగు భూమిని ఇవ్వాలని కోరారు.

అయినా మారని బతుకులు

ఫలితంగా గుట్టలపై దుర్భర జీవనం గడుపుతున్న గిరిజనులు

మౌలిక సదుపాయాలు

కల్పించాలని డిమాండ్‌

ప్రజాస్వామ్యంలో మేము సైతం..1
1/1

ప్రజాస్వామ్యంలో మేము సైతం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement