అపరిచితులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు
● తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ సాయిశ్రీ
వరంగల్ క్రైం: అపరిచిత వ్యక్తులు, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సైబర్ సెక్యూరిటీ ఎస్పీ సాయి శ్రీ తెలిపారు. ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ కార్యక్రమంలో భాగంగా సైబర్ సెక్యూరిటీ, వరంగల్ కమిషనరేట్ సైబర్ విభాగం ఆధ్వర్యంలో బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ కార్యక్రమం ద్వారా సైబర్ నేరాలపై ప్రజలతోపాటు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. డిజిటల్ అరెస్ట్, లోన్ యాప్‌లు, పెట్టుబడి మోసాలు, మ్యాట్రిమోని, ట్రేడింగ్ యాప్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్నారో, అలాగే వారి బారిన పడకుండా తీసుకోవాల్సి న జాగ్రత్తలు వివరించారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, అదేవిధంగా http://www.cybercrime.govin వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయొచ్చన్నారు. సైబర్ సెక్యూరిటీ వింగ్ వరంగల్ విభాగం డీఎస్పీ గిరికుమార్, ఇన్‌స్పెక్టర్లు యాసిన్,అశోక్ కుమార్, కళాశాల ప్రిన్స్‌పాల్ ప్రకాశ్, ఎస్సైలు చరణ్ కుమార్, శివ కుమార్, ఎస్‌బీఐ ప్రాంతీయ మేనేజర్ అబ్దుల్ రహీమ్ షేక్, తదితరులు పాల్గొన్నారు.


