దూరభారమైనా.. తరలొచ్చి
నాడు భర్త.. నేడు భార్య
● సర్పంచ్‌లుగా దంపతులు..
చదువుతోపాటు జీవనోపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రజలను ఓటు స్వగ్రామం రప్పించింది. దూరభారమైనా ఎంతో మంది రాష్ట్రాలు దాటొచ్చి రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకున్నారు. గుజరాత్ లాంటి సుదూర ప్రాంతాల నుంచి తరలొచ్చి బుధవారం జరిగిన మూడో విడత జీపీ ఎన్నికల్లో ఓటేసి పల్లె ప్రగతిలో భాగస్వాములయ్యారు. ఓటు విలువను చాటి చెప్పి ఆదర్శంగా నిలిచారు.
నర్సంపేట: మాది చెన్నారావుపేట మండలం పాత మగ్ధుంపురం. నేను గుజరాత్ రాష్ట్రం వడోదరలోని పారుల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న. తెలంగాణలో జీపీ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్ నుంచి స్వగ్రామం వచ్చా. బుధవారం తొలిసారి ఓటు వేశా. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది.
–వేములపల్లి మోహిత్‌శ్రీరామ్, మగ్ధుంపురం
ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలోని 10వ వార్డు సభ్యురాలిగా కూతురుపై తల్లి గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థిగా కూతురు తిక్క శ్యామల బరిలో నిలవగా, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా తల్లి ఇలపొంగు కొంరమ్మ బరిలో నిలిచారు. చివరకు ఉత్కంఠగా వెలువడిన ఫలితాల్లో 2 ఓట్ల మెజార్టీతో కూతురు శ్యామలపై తల్లి కొంరమ్మ విజయం సాధించింది.
ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి పర్వతగిరి మహేశ్వరి తన సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థి పాపని రూపాదేవిపై 349 ఓట్లతో గెలుపొందారు. కాగా, మహేశ్వరి భర్త పర్వతగిరి రాజు గత పర్యాయం సర్పంచ్‌గా పనిచేశారు. దీంతో అప్పుడు భర్త.. ఇప్పుడు భార్యను సర్పంచ్ పదవి వరించింది.
మరిపెడ రూరల్: మరిపెడ మండలం నీలికుర్తి జీపీ శివారు రేఖ్యతండాకు చెందిన బానోత్ మనోహర్ గతంలో ఉమ్మడి నీలికుర్తి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో రేఖ్యతండా గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. ఈ క్రమంలో ప్రస్తుతం సర్పంచ్ పదవిని ఎస్టీ మహిళకు రిజ్వర్ చేశారు. దీంతో మనోహర్ భార్య పార్వతి బుధవారం జరిగిన మూడో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి గుగులోత్ కల్యాణిపై 29 ఓట్లతో గెలుపొందారు.
దూరభారమైనా.. తరలొచ్చి


