రెండో విడత హస్తగతం
అత్యధిక స్థానాల్లో గెలిచిన
కాంగ్రెస్ మద్దతుదారులు
సాక్షి, మహబూబాబాద్: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మోస్తరు ఫలితాలతో ముందు వరుసలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు.. రెండో విడత విజయపథంలో దూసుకెళ్లారు. గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాలు కై వసం చేసుకున్నారు. అయితే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి, బయ్యారంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యకు రెబల్స్ షాక్ ఇచ్చారు. అత్యధిక స్థానాలు గెలుచుకొని సత్తాచాటాలని కష్టపడి ప్రచారం చేసిన బీఆర్‌ఎస్ నాయకులు ఆంతంత మాత్రం ఫలితాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మేజర్ గ్రామ పంచాయతీల్లో అత్యధిక ఓట్లతోపాటు, అభ్యర్థుల మధ్య నువ్వా.. నేనా..? అన్నట్లు పోటీ సాగింది.
అత్యధిక స్థానాలు చేతికే..
జిల్లాలో మొత్తం 482 గ్రామ పంచాయతీలు, 4,110 వార్డులకు గాను రెండో విడత 158 పంచాయతీలు, 1,358 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే 15 పంచాయతీలు, 251 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 143 పంచాయతీలు, 1,107 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 115 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. 38 పంచాయతీల్లో బీఆర్‌ఎస్, 05 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించా రు. మొదటి విడత ఐదు పంచాయతీలు గెలుచుకున్న భారతీయ జనతాపార్టీ రెండో విడతలో ఒక్కస్థానం కూడా గెలవకపోవడం గమనార్హం.
20 పంచాయతీల్లో 19 కాంగ్రెస్ కై వసం
గార్ల: మండలంలోని 20 పంచాయతీలకుగాను, 19 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. మిగతా ఒక్క పంచాయతీ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుచుకున్నాడు. మండలంలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభీ మోగించడంతో ఆ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
ఒక్క ఓటుతో గెలుపు!
బయ్యారం: బయ్యారం మేజర్ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికల్లో ఒక్క ఓటుతో ఇరువురు అభ్యర్థులు విజయం సాధించారు. 7వ వార్డులో ఎట్టి సరిత, 13 వ వార్డులో పోస్టల్ బ్యాలెట్‌తో బందెల కళింగరెడ్డి విజయం సాధించారు. అత్యల్ప మెజార్టితో విజయం సాధించడంతో అభ్యర్థులతోపాటు ఆయా వార్డుల ఓటర్లు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
చెల్లైపె అన్న విజయం
బయ్యారం: మండలంలోని వెంకటాపురం పంచాయతీ సర్పంచ్ పదవికి అన్న చెల్లె పోటీపడగా ఆదివారం వెల్లడైన ఫలితాల్లో అన్న విజయం సాధించారు. బొర్ర కృష్ణ కాంగ్రెస్ మద్దతు ఇవ్వగా అతని చెల్లె పొడుగు సుగుణకు బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చింది. ఆసక్తికర పోటీలో చెల్లైపె అన్న విజయం సాధించారు.
ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి రెబల్స్ షాక్
కష్టపడ్డా వేగం పుంజుకోని కారు
మేజర్ గ్రామ పంచాయతీల్లో
నువ్వా.. నేనా..?
కష్టపడ్డా.. పుంజుకోని కారు
పార్టీ బలానికి ఆయువు పట్టయిన పంచాయతీల్లో పట్టు సాధించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కష్టపడ్డా.. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ప్రధానంగా మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవి త, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఇతర నాయకులు కాంగ్రెస్‌కు పోటీగా ప్రచా రం చేశారు. అయితే ఇల్లెందు నియోకవర్గంలోని గార్లలో 20 పంచాయతీలు ఉండగా 19 స్థానాలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో కూడా ఆశించిన ఫలితాలు రాలేదు. డోర్నకల్ నియోకవర్గంలో కాంగ్రెస్ సగం పంచాయతీలు కూడా గెలవలేదు. మొత్తం 158 స్థానాల్లో కనీసం మూడో వంతు స్థానాలు కూడా బీఆర్‌ఎస్ గెలుచుకోలేకపోయింది.
మండలం కాంగ్రెస్ బీఆర్‌ఎస్ స్వతంత్ర ఏగ్రీవం మొత్తం
బయ్యారం 16 08 04 01 29
చిన్నగూడూరు 06 03 00 02 11
గార్ల 17 01 00 02 20
పెద్దవంగర 13 07 00 06 26
దంతాలపల్లి 14 02 00 02 18
నర్సింహులపేట 16 06 00 01 23
తొర్రూరు 21 09 00 01 31
మొత్తం 103 36 04 15 158
ఎమ్మెల్యేలకు రెబల్స్ షాక్..
జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయ ఢంకా మోగించగా.. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు మాత్రం కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులు షాక్ ఇచ్చారు. పాలకుర్తి నియోజకవర్గంలోని యశస్వినిరెడ్డి సొంత గ్రామం చర్లపాలెంతోపాటు, కిష్టాపురం, మడిపల్లి, సోమారం, గుర్తూరు, పత్తేపురం గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారు. వీరందరు గత కొంతకాలంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకవర్గంగా ఉన్నవారు కావడం గమనార్హం. అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం మండలంలో కాచనపల్లి, నర్సీతండా, జగ్గుతండా పంచాయతీల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారు.
రెండో విడత హస్తగతం


