రామప్పను సందర్శించిన యునెస్కో భారత రాయబారి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని పారిస్ నుంచి వచ్చిన యునెస్కో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి విశాల్ వి.శర్మ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, (ఏఎస్‌ఐ) రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ, పరిరక్షణ చర్యలను ఆయన సమీక్షించారు. యునెస్కోకు సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్‌కు విశాల్ వి.శర్మ చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ కీలక పదవిని నిర్వహించిన మొదటి భారతీయుడు. ఇటీవల ఢిల్లీలోని ఎరక్రోటలో జరిగిన ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ సేఫ్ గార్డింగ్ ది ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ 20వ సెషన్‌కు కూడా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలోనే దీపావళిని యునెస్కోకు చెందిన ఐసీహెచ్ జాబితాలో చేర్చారు. 2021లో రాయబారి విశాల్ వి.శర్మ సారథ్యంలోనే రామప్ప ఆలయం కూడా ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. ఇన్‌కోయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) కార్యక్రమానికి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. పరిరక్షణ చర్యలను సమీక్షించేందుకు జిల్లాలో పర్యటించారు. ఏఎస్‌ఐ నుంచి డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు డాక్టర్ హెచ్.ఆర్. దేశాయ్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ ఇంజనీర్ కృష్ణ చెతన్య, అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు డాక్టర్ రోహిణి పాండే అంబేడ్కర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ నాగోజీరావు తదితరులు పాల్గొన్నారు.


