ఇక పాఠశాలల్లో తనిఖీలు
● వసతులు, రికార్డుల పరిశీలన
● 34 మంది ఉపాధ్యాయలతో
ప్రత్యేక బృందం
● జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు నివేదికలు
మహబూబాబాద్ అర్బన్: ఇకపై పాఠశాలల్లో పిల్లల భద్రత, నాణ్యమైన విద్య, పాఠశాల రికార్డులు, పాఠశాలకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఇతర సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించే బాధ్యత ప్రభుత్వం ఉపాధ్యాయులకు అప్పగించింది. ఈ తనిఖీలు ప్రధానోపాధ్యాయులు, పీఎస్ హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ ఉపాధ్యాయులు పాఠశాలలను తనిఖీలు నిర్వహించి జిల్లా విద్యాశాఖ అధికారులకు రిపోర్టు అందజేస్తారు. గతంలో బడి ఎలా ఉండేది, ప్రస్తుతం బడి ఎలా ఉన్నది అనే విషయాన్ని ఆరాతీసి విద్యార్థుల విద్య అభివృద్ధికి దోహదం చేస్తారు. అదేవిధంగా ఉపాధ్యాయుల పనితీరు వారి హాజరు, విద్యార్థుల సామర్థ్యం, వారి హాజరు అంశాలను పరిశీలిస్తారు. లోపాలు అవకతవకలు ఉంటే రాష్ట్ర విద్యాశాఖకు నివేదికను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా తెలియజేస్తారు.
ఒక బృందంలో పది మంది ఉపాధ్యాయులు
జిల్లా పరిధిలో 676 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటు 8 మోడల్ స్కూళ్లు, 17 కేజీబీవీలు ఉన్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులు సీనియర్ ఉపాధ్యాయులతో తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. డిప్యూటేషన్‌పై ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు వీరు పనిచేయనున్నారు. జిల్లాలో 676 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వీటికి సంబంధించి 15 మంది ఉపాధ్యాయులను నియమించారు. 5 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో ఇద్దరు ఎస్జీటీలు, ఒక పీఎస్ హెచ్‌ఎం ఉంటారు. 120 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిని తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన బృందంలో ఒక స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్‌ఎం, ఎస్జీటీ ఉంటారు. ముగ్గురు ఉపాధ్యాయులను నియమించారు. 102 ఉన్నత పాఠశాలలు ఉండగా, రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఏడుగురు ఎస్‌ఏలు, పీడీ, పీజీ హెచ్‌ఎం ఉంటారు. మొత్తం 36 మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్‌పై విధులను కేటాయించారు. వీరంతా గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత పాఠశాలలను తనిఖీ చేయనున్నారు. వారానికోసారి, లేనిపక్షంలో ప్రతీరోజు నివేదికను డీఈఓ కార్యాలయంలో అందజేయనున్నారు.
తనిఖీలతో పాఠశాలలో మెరుగు
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగు పడేందుకు తనిఖీ బృందాల పరిశీలన ఉపయోగపడుతుంది. తనిఖీ బృందాలు, కేటాయించిన పాఠశాలలను ప్రతీరోజు రెండు చొప్పున తనిఖీ చేస్తూ వాటి అభివృద్ధికి తగిన సూచనలు సలహాలు ఇస్తారు. ఈ బృందాల ద్వారా జిల్లాలోని విద్యార్థుల ప్రగతి మెరుగవుతుందని ఆశించవచ్చు. తనిఖీ బృందాల నివేదికలు ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయి అధికారులకు పంపిస్తాం.
– రాజేశ్వర్, డీఈఓ


