పోలింగ్ ప్రశాంతం
మహబూబాబాద్: జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. కాగా ఉదయం చలి తీవ్రతతో మంద కోడిగా ప్రారంభమైన పోలింగ్ 9 గంటల తర్వాత ఊపందుకుంది. కాగా, జిల్లాలో రెండో విడతలో ఎన్నికలు నిర్వహించిన ఏడు మండలాల్లో 85.05 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా అదనపు కలెక్టర్, ఎన్నికల అబ్జర్వర్‌తోపాటు ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక అధికారులు పోలింగ్ సరళి, కౌంటింగ్‌ను పరిశీలించారు. ఇదిలా ఉండగా.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. సమయం ముగిసిన తర్వాత క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఉదయం చలి తీవ్రతతో ఓటర్లు పెద్దగా బయటకు రాలేదు. ఉదయం 9గంటల తర్వాత పోలింగ్ ఊపందుకుంది. వృద్ధులు, దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్లు ఏర్పాటు చేశారు.
143 జీపీలు, 1,106 వార్డుల్లో పోలింగ్
జిల్లాలో రెండో విడతలో బయ్యారం, చిన్నగూడూ రు, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు మండలాలు ఉండగా ఈనెల 14(ఆదివారం) పోలింగ్ నిర్వహించారు. ఆయా మండలాల్లో 158 జీపీలు ఉండగా 15 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 143 జీపీలకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 1,360 వార్డులకు 251 ఏకగ్రీవం కాగా 3 నోవాల్యువుడ్ వార్డులు ఉండగా మిగిలిన 1,106 వార్డుల్లో పోలింగ్ జరిగింది.
పురుషులే అధికం..
పోలింగ్ పరంగా చూస్తే పురుష ఓటర్లదే పైచేయిగా నిలిచింది. మొత్తం ఓటర్లలో పురుషులు 97,561 మంది, మహిళా ఓటర్లు 10,1216 ఉన్నారు. కాగా 97,561 మంది పురుషులు 83,479(85.57 శాతం) మంది ఓటు వేశారు. మహిళా ఓటర్లు 10,1216 మంది ఉండగా 85,589(84.56 శాతం) మంది పోలింగ్‌లో పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు.
పోలింగ్, లెక్కింపు సరళి పరిశీలన
బయ్యారం మండల కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటింగ్ సరళిని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పరిశీలించారు. గార్ల మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలల్లో పోలింగ్ సరళిని జనరల్ అబ్జర్వర్ మధుకర్ బాబు, ప్రత్యేక అధిదికారి మరియన్న పరిశీలించారు. నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటింగ్ సరళిని సాధారణ పరిశీలకుడు మధుకర్ బాబు, ప్రత్యేక అధికారి శ్రీమన్నానారాయణ, ఎంపీడీఓ రాధిక, తహసీల్దార్ రమేష్‌బాబు, చిన్నగూడూరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలో పోలింగ్ సరళిని ప్రత్యేక అధికారి బీమ్లా నాయక్, ఆర్డీఓ కృష్ణవేణి పరిశీలించారు.
రెండో విడతలో 85.05 శాతం ఓటింగ్
ఏడు మండలాల్లో నిర్వహణ
ఓటు హక్కు వినియోగించుకున్న 1,69,071 మంది ఓటర్లు
ఉదయం 9 గంటల వరకు పుంజుకున్న ఓటింగ్
పోలింగ్ సరళిని పరిశీలించిన
అదనపు కలెక్టర్


