వరాలు కురిపిస్తారా..!?
సాక్షిప్రతినిధి, వరంగల్ : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సుమారు 35 రోజుల తర్వాత మళ్లీ ఓరుగల్లులో పర్యటిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు శుక్రవారం తొలిసారి వస్తున్న ఆయన... ‘ప్రజాపాలన – ప్రజావిజయోత్సవాల’ సందర్భంగా పలు అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్ప డి రెండేళ్లు పూర్తి కావొస్తున్న తరుణంలో నర్సంపేట సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన పథకాలు, నిధులపై స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. గ్రేటర్ వరంగల్‌తోపాటు ఉమ్మడి వరంగల్‌పై ఏం వరాలు కురిపిస్తారనే చర్చ జరుగుతోంది. అలాగే ‘మోంథా’ తుపాను నేపథ్యంలో ఇళ్లు కూలిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.15వేలకు చెల్లించిన ప్రభుత్వం.. పంటల నష్టంపై నివేదికలు పంపిన చాలామందికి పరిహారం అందలేదు. వీటిపైన సీఎం ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
డీపీఆర్ స్థాయిలోనే ‘గ్రేటర్’పనులు...
ఉమ్మడి వరంగల్‌కు కావాలి నిధులు..
ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వరంగల్‌పై పలు హామీలు కురిపించారు. హైదరాబాద్‌తో పోటీ పడేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ఈ మేరకు సుమారు దశల వారీగా రూ.6,500 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. ఇందులో మామునూరు ఎయిర్‌పోర్టుకు రూ.150 కోట్ల వరకు నిధులు విడుదలై భూసేకరణ జరుగుతోంది. భద్రకాళి చెరువు పూడిక, మాఢ వీధులు నిర్మాణం తదితర పనులు నడుస్తున్నాయి. వరంగల్ నగరంలో సుమారు నాలుగు వేల కోట్ల విలువైన అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ ప్రతిపాదనలు డీపీఆర్‌ల దశలో ఉన్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్డులతోపాటు పలు అభివృద్ధి పథకాలకు నిధులు మంజూరైనా ఆ పనులు సాగడం లేదు. స్మార్ట్‌సిటీ పనులకు తోడు రాష్ట్రం వాటా కింద నిధులు మరిన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రావాల్సి ఉంది. అలాగే ఉమ్మడి వరంగల్‌లో మేడారం అభివృద్ధి, గిరిజన యూనివర్సిటీలకు మరిన్ని నిధులు అవసరం ఉందని ఇటీవల ప్రజాప్రతినిధులు సీఎంను కోరారు. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కూడా ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
ఆ మూడు పథకాలపై స్పష్టత...
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఇటీవల వరంగల్‌లో పర్యటించారు. కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయూ), కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులను ఆయన ప్రత్యేకంగా పరిశీలించి సమీక్షించారు. ఈ సందర్భంగా 7 మెగా టెక్స్ టైల్ పార్కుల్లో ఒకటైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పనులపై కేంద్రం మొత్తం రూ.200 కోట్లతో చేపట్టగా రూ.1,700 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 12,500 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు విషయంలో 696 ఎకరాల భూమి ఎయిర్ పోర్టు అధికారుల వద్ద ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం సుమారు 243 ఎకరాల భూమి సేకరించి ఎయిర్ పోర్టు అథారిటీకి అందజేస్తే త్వరగా నిర్మాణం ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. కాజీపేటలోని రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుందన్నారు. ఈ మూడు పథకాల విషయంలో పలుమార్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీవర్గాల సమాచారం.
ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ కానున్న సీఎం?
‘ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ సభ’లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సభలో మాట్లాడనున్న ఆయన ఉమ్మడి వరంగల్‌పై నిధుల జల్లు కురిపిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అంతకు ముందు గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో తాజా పరిస్థితి ఏమిటి? పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏం జరుగుతోంది.. ? అని మాట్లాడనున్నారు. మెజార్టీ స్థానాల్లో పార్టీ మద్దతు దారులు గెలిచేలా రేవంత్‌రెడ్డి మరోసారి మార్గదర్శనం చేయనున్నారని తెలిసింది.
నేడు నర్సంపేటకు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
గత పర్యటనలో రూ.6,500 కోట్లు మంజూరు చేసిన సీఎం..
మందకొడిగా పనులు..
ఇటీవల జిల్లాకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. మామునూరు, కేఎంటీపీ,
ఆర్‌ఎంయూలపై వ్యాఖ్యలు
ఈ మూడు ప్రాజెక్టులలో రాష్ట్రం పాత్రపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం
ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి
మరిన్ని నిధులపై ఆశలు
అన్ని ఏర్పాట్లు పూర్తి
సాక్షి, వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్: నర్సంపేట నియోజకవర్గానికి తొలిసారి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సభకు జనసమీకరణ చేయనున్నారు. ప్రజాపాలన–ప్రజా విజయోత్సవ సభలో భాగంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి రూ.1,023 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు, నాయకులు హాజరుకానున్నారు. సభా ఏర్పాట్లను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఆర్డీఓ ఉమారాణి, ఏసీపీ రవీందర్ పరిశీలించారు. హెలిపాడ్, సభా ప్రాంగణాన్ని బాంబ్ స్క్వాడ్ బృందాలు, జాగీలాలు తనిఖీ చేశాయి.
సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా..
సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 1.15 గంటలకు హైదరాబాద్ బేగంపేటనుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. 2 గంటలకు నర్సంపేట లోని బంజారాభవన్‌లో ఏర్పాటుచేసిన హెలి పాడ్‌లో దిగుతారు. మధ్యాహ్నం 2.15నుంచి 3.55 వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు.


