మానుకోటలోనే రైల్వే డిపో ఏర్పాటు చేయాలి
మహబూబాబాద్ రూరల్ : మానుకోట ప్రాంతంలోనే రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్‌చందర్ డిమాండ్ చేశారు. జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ హాల్‌లో గురువారం న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ్‌చందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనంతారం పరిధిలో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేస్తామని ప్రకటించి మోసం చేయడం సరికాదన్నారు. రూ.908 కోట్లు మంజూరు చేస్తున్నామని పేర్కొని, ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం నిజంకాదా అని ప్రశ్నించారు. స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు కానున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో సమాచారం వచ్చిందని, ఆ ప్రయత్నాలు మానుకోవాలన్నారు. రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో విషయంలో జేఏసీ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి తరలకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. స్థానికంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించే అంశాలపై ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ, న్యాయవాదులు మామిడాల సత్యనారాయణ, మేక సురేష్ రెడ్డి, తుంపిళ్ల శ్రీనివాస్, భూక్య మోహన్ నాయక్, డేగల సత్యనారాయణ, ఉగ్గుల అశోక్, మౌనిక, రాజమణి, సునీత పాల్గొన్నారు.


