ఎన్నికల బంధం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల బంధం

Dec 5 2025 2:04 PM | Updated on Dec 5 2025 2:04 PM

ఎన్నికల బంధం

ఎన్నికల బంధం

– 8లోu

పోటీపడుతున్న వారిని

బుజ్జగిస్తున్న బంధువులు

దీర్ఘకాలిక శత్రువులను

కలుపుతున్న ఎన్నికలు

మద్దతు తెలపాలని ఇంటికి వెళ్లి అభ్యర్థుల ప్రాధేయం

బంధువుల గెలుపు కోసం

దూరం నుంచి వచ్చి ప్రచారం

ఇనుగుర్తి మండలం చిట్యాతండా గ్రామ పంచాయతీలో ముగ్గురు అన్నదమ్ములు వేర్వేరు పార్టీల మద్దతుతో పోటీకి దిగారు. కుటుంబ సభ్యులు బతి మిలాడినా ముగ్గురూ పట్టించుకోలేదు. చివరకు బంధువులు జోక్యం చేసుకొని ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడారు. మీ మధ్య పోటీ సరికాదని, ఎన్నికలు అన్నదమ్ములను శత్రువులను చేస్తాయని హితవు పలికారు. దీంతో ఇద్దరు నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోగా.. ఒకరు బరిలో ఉన్నారు.

తొర్రూరు మండలం మాటేడు గ్రామంలో బాబాయ్‌, అబ్బాయి(అన్నకొడుకు)లు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మద్దతుతో పోటీకి సిద్ధమయ్యారు. ఇరువర్గాలు తమ క్యాడర్‌ను తయారు చేసుకొని నామినేషన్‌ వేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అన్నదమ్ములు, బంధువులు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు. చివరకు అబ్బాయి పోటీలో ఉండగా.. బాబాయ్‌ పోటీ నుంచి తప్పుకున్నాడు.

మహబూబాబాద్‌ మండలం వీఎస్‌ లక్ష్మీపురం గ్రామంలో సర్పంచ్‌ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయ్యింది. బీఆర్‌ఎస్‌ నుంచి సురుగు సుజాత, సురుగు పూలమ్మ, సురుగు ఐలమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ముల భార్య లు ఉండగా, ఒకరు అత్త పోటీపడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ముగ్గురితో మాట్లాడారు. పూలమ్మ, ఐలమ్మ నామినేషన్‌ విరమించుకోగా.. సుజాత మాత్రమే పోటీలో ఉన్నారు.

సాక్షి, మహబూబాబాద్‌:

..ఇలా పంచాయతీ ఎన్నికల్లో కుటుంబ సభ్యుల సమన్వయం, పెద్దల జోక్యం, అన్నదమ్ములు విడిపోవద్దనే ఆలోచనతో వేసిన నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారు. అదేవిధంగా పోటీ చేసేవారిలో గిట్టని వారు ఉంటే.. బరిలోకి దిగి నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు.

శత్రువులను కలుపుతున్న ఎన్నికలు

పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకంగా మారుతుంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు. అయితే గ్రామాల్లో గెట్ల పంచాయితీ, కుటుంబ కలహాలతో సుదీర్ఘ కాలంగా విడివిడిగా ఉన్న అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, మామ అల్లుండ్ల మధ్య అంతరాలు తగ్గుతున్నాయి. పోటీ చేసిన అభ్యర్థులు కుటుంబ సమేతంగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి తమకు మద్దతు ప్రకటించాలని బతిమిలాడుతున్నారు. ఇరువర్గాలకు కావాల్సిన బంధువులను మధ్యలో పెట్టి రాయబారాలు పంపుతున్నారు. దీంతో ఇప్పటి వరకు శత్రువుగా చూసిన వారు కూడా ఇంటికి వచ్చి మద్దతు అడగడంతో భేషజాలు విడిచిపెట్టి బంధుత్వాలను నెమరు వేసుకుంటున్నారు. ఒకరి గెలుపుకోసం మరొకరు ప్రచారంలోకి దిగుతున్నారు.

ప్రచారం కోసం పల్లెకు..

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి గెలుపు.. మద్దతు తెలిపిన పార్టీలకే కాకుండా, బంధువులకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. తమ అన్న, తమ్ముడు, బాబాయ్‌, మామ, అల్లుడు పోటీలో ఉండి ఓడిపోతే గ్రామంలో పరువు పోతుందని, ఇప్పటి వరకు గ్రామంలో ఉన్న పట్టుపోతుందనే ఆలోచనతో ఉన్నారు. ఇందుకోసం తమ బంధువులను గెలి పించుకునేందుకు హైదరాబాద్‌, వరంగల్‌, సూరత్‌, ఖమ్మం మొదలైన ప్రాంతాల్లో నివాసం ఉండే వారు కూడా పల్లెబాట పడుతున్నారు. తమ అనుచరులను గెలిపించుకునేందుకు ఆర్థిక సాయం కూడా చేస్తూ గెలిచి తీరాలి.. ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement