గ్యారంటీ ఇవ్వాల్సిందే..
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం నేరుగా మిల్లులకు తరలిస్తారు. అయితే సీఎంఆర్ విషయంలో ఇబ్బందులు రాకుండా మిల్లర్ల పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా, గతంలో కొందరు మిల్లర్లు తీసుకున్న ధాన్యం సీఎంఆర్ పెట్టకుండా జాప్యం చేయడం.. ఎన్నిసార్లు నోటీసలు ఇచ్చినా.. కేసులు పెట్టినా స్పందించలేదు. దీంతో ప్రస్తుతం అధికారులు ధాన్యం పెట్టేందుకు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. మిల్లు సామర్థ్యం అంచనా వేసి వారు తీసుకున్న ధాన్యంపై 10శాతం ముందస్తు బ్యాంకు గ్యారంటీ, డిపాజిట్ చేస్తేనే ధాన్యం సరఫరా చేస్తామని అధికారులు అంటున్నారు.
10శాతం ముందస్తు డిపాజిట్..
ఈ ఏడాది వానాకాలం ధాన్యం కొనుగోలుకు సిద్ధమవుతున్న సివిల్ సప్లయీస్ అధికారులు ధాన్యం మిల్లింగ్‌పై కూడా దృష్టి సారించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రైస్ మిల్లు మిల్లింగ్ సామర్థ్యం అంచనా వేసి మొత్తం మీద 10శాతం డబ్బులు ముందుగా డిపాజిట్ చేయాలని ఆదేశించారు. అలా అయితేనే మిల్లుకు ధాన్యం పంపిస్తామని చెబుతున్నారు. జిల్లాలో 52 రా రైస్ మిల్లులు, 10 బాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. ఈ వానాకాలం మొత్తం 2లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మిల్లింగ్ చేసిన తర్వాత 67శాతం బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి కిలోకు రూ.28 చొప్పున రేటు కట్టి.. మిల్లుకు పంపించే ధాన్యం అంచనా వేసుకొని ముందుగానే 10శాతం బ్యాంకు గ్యారంటీ సివిల్ సప్లయీస్ శాఖ పేరిట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఈ మొత్తం రూ.480 కోట్లు ఉండే అవకాశం ఉంది. ఇందులో 10 శాతం అంటే రూ. 48కోట్లు మిల్లర్ల నుంచి డిపాజిట్ చేయించాల్సి ఉంటుంది. ఇందులో రోజుకు 2టన్నులు మర ఆడించే సామర్థ్యం ఉన్న మిల్లుకు రూ.38 లక్షలు, 4టన్నుల సామర్థ్యం ఉన్న మిల్లుకు రూ.74 లక్షలు ముందుగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
అనుభవాల నేపథ్యంలో..
గతంలో సీఎంఆర్‌లో అనేక అవకతవకలు జరి గాయి. కొందరు మిల్లర్లు దిగుమతి చేసుకున్న ధాన్యం మిల్లింగ్ చేయకుండా అమ్ముకోవడం.. పీడీఎస్ బియ్యం దందాతో సీఎంఆర్ పెట్టిన ఘటనలు వెలుగు చూశాయి. మరికొందరు మిల్లర్లు అసలు మిల్లు నడిపించకుండానే ధాన్యం తీసుకొని సీఎంఆర్ పెట్టలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే 2023–24 ఖరీఫ్ సీజన్‌లో మిల్లర్లకు ఎగుమతి చేసిన ధాన్యం సీఎంఆర్ పెట్టకుండా 11 మిల్లుల యజమానులు మొండికేశారు. వాటికి సంబంధించి రూ. 19 కోట్లు అసలు, 25శాతం ఫెనాల్టీ రూ.5కోట్లు.. మొత్తంగా రూ. 24కోట్లు ఇంకా ప్రభుత్వానికి రావాల్సి ఉంది. వాటిపై రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకొని కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ముందుగా ధాన్యం ఇచ్చి వారితో ఇబ్బందులు పడడం ఎందుకని సివిల్‌సప్లయీస్ ఉన్నత అధికారులు బ్యాంకు గ్యారంటీ తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే గత యాసంగి సీజన్‌లో కొందరు మిల్లర్లు తమ సామర్థ్యంలో 10 శాతం కన్నా తక్కువ బ్యాంకు గ్యారంటీ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు కొందరితో ఒక తీరుగా.. మరికొందరితో మరో తీరుగా వ్యవహరిస్తున్నారని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. తమ సామర్థ్యం కన్నా తక్కువ డిపాజిట్ జమచేసే విధంగా అవకాశం కల్పించాలని కొందరు ఇప్పటి నుంచి పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది.
బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే ధాన్యం
గతంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మిల్లింగ్ సామర్థ్యం ఆధారంగా గతంలో ఇచ్చిన ధాన్యం లెక్కలు, ప్రస్తుతం ఇచ్చే ధాన్యం అంచనాలు తీసుకొని మొత్తం ధాన్యం విలువలో మిల్లర్ల నుంచి 10శాతం డబ్బులు ముందస్తుగా డిపాజిట్ చేసుకున్న తర్వాతే ధాన్యం ఎగుమతి చేస్తాం. ఇక్కడ ఎవరిని ఉపేక్షించేది లేదు.
–అనిల్ కుమార్, అదనపు కలెక్టర్(రెవెన్యూ)
రైస్ మిల్లర్లకు సివిల్ సప్లయీస్ అధికారుల ఆదేశం
సామర్థ్యంలో 10శాతం డిపాజిట్ చెల్లిస్తేనే ధాన్యం సరఫరా
గతంలో మిల్లర్ల అక్రమాలకు
డిపాజిట్‌తో అడ్డుకట్ట
తక్కువ డిపాజిట్ కోసం మిల్లర్ల
ప్రయత్నాలు
ససేమిరా అంటున్న అధికారులు
గ్యారంటీ ఇవ్వాల్సిందే..


