కార్డుల జారీతోనే సరి!
● నిరుపయోగంగా ఈ–శ్రమ్ కార్డులు
● జిల్లాలో 1.30 లక్షల మంది నమోదు
● కార్మికులకు అందని ప్రయోజనాలు
నెహ్రూసెంటర్: అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు ప్రయోజనాలు చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ పథకం ప్రవేశపెట్టింది. అయితే పథకం కార్డులు జారీకే పరిమితమై నిరుపయోగంగా మారాయి. ఈ–శ్రమ్‌పోర్టల్‌లో నమోదు చేసుకుని కార్డు పొందిన కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి, శాశ్వత వైకల్యం పొందితే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కలుగుతుంది. కాగా, 2021లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు రాలేదు. ప్రభుత్వం నుంచి పథకానికి సంబంధించిన ఎలాంటి విధి విధానాలు రాలేదని అధికారులు తెలుపుతున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి కోసం కార్మికులు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేకుండా పోయింది.
లక్షకుపైగా కార్డుల జారీ...
జిల్లాలో ఈ–శ్రమ్ పోర్టల్ ద్వారా 1.31లక్షల మంది నమోదు చేసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, వ్యవసాయ కూలీలతో పాటు అన్ని రంగాల్లో పని చేస్తున్న కార్మికులు దరఖాస్తు చేసుకుని ఈ–శ్రమ్ కార్డులు పొందారు. అయితే పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు లేకపోవడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు లేబర్ కార్డు కలిగిన కార్మికులు 8,8631 మంది జిల్లాలో ఉన్నారు. వీరికి వివాహం, కాన్పు, మరణం వంటి వాటికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందజేస్తుంది. ఇదే తరహాలో ఈ–శ్రమ్ పథకం ద్వారా సహాయం అందించాలని కార్మికులు కోరుతున్నారు.
ఐదేళ్లలో పథకం అమలు శూన్యం..
కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ ప్రారంభించి దరఖాస్తు చేసుకోవాలని సూచించగా జిల్లాలో ఉన్న కార్మికులు ఆన్‌లైన్, మీసేవ, కామన్ సర్వీస్ సెంటర్లలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పఽథకం ద్వారా ఎంతో ప్రయోజనం కలుగుతుందనుకున్న కార్మికులకు నిరాశే మిగిలింది. గతేడాది మరణించిన కార్మిక కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలని సూచించగా.. కార్మికులు దరఖాస్తులను కార్మికశాఖలో సమర్పించారు. అయినప్పటికీ పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు అందలేదని కార్మికులు వాపోతున్నారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే..
ఈ–శ్రమ్ పథకంలో నమోదు చేసుకున్న కార్మికులకు సంబంధించిన వివరాలు కార్మికశాఖలో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి పథఽకానికి సంబంధించిన అమలు తీరుపై ఎలాంటి ఆదేశాలు లేవు. మరణించిన కార్మికుల కుటుంబాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వాటిని ప్రభుత్వానికి, కార్మికశాఖకు పంపించాం. కార్మికులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా కార్మికశాఖ కార్యాలయంలో సంప్రదించాలి.
–రమేశ్, ఏఎల్‌ఓ, మహబూబాబాద్
కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి..
అసంఘటిత రంగంలో పని చేస్తున్న లక్షలాది మంది కార్మికులకు ప్రభుత్వాలు న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ–శ్రమ్ పథకం ద్వారా మరణించిన, శాశ్వత వైకల్యం పొందిన కార్మిక కుటుంబాల ను ఆదుకోవాలి. ఈ పథకంతో పాటు లేబర్ కార్డు కలిగిన కార్మికులకు ప్రయోజనాలు పెంచి ఇవ్వాలి.
–పర్వత కోటేష్, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు
కార్డుల జారీతోనే సరి!
కార్డుల జారీతోనే సరి!


