ఆటలు ఆడలే..
● జిల్లాలో నిరుపయోగంగా
క్రీడా ప్రాంగణాలు
● పలుచోట్ల బోర్డులకే పరిమితం
● ఆటలకు దూరంగా యువకులు, విద్యార్థులు
తొర్రూరు: గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో గత ప్రభుత్వం జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణం కోసం స్థలం కేటాయించింది. ఉన్నతాధికారుల ఒత్తిడి, సమన్వయలోపం కారణంగా ఎక్కడ పడితే అక్కడ మైదానాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల గ్రామానికి కిలో మీటర్ల దూరంలో తూతూ మంత్రంగా బోర్డులు పెట్టి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం యువకులు, విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు వీలు లేకుండా తయారయ్యాయి. దీంతో పొలాలు, చేన్లలో చదును చేసి ఆడుకునే పరిస్థితి దాపురించింది.
అధ్వానంగా క్రీడా ప్రాంగణాలు..
జిల్లాలోని 482 పంచాయతీలు, 5 మున్సిపాలిటీల్లో 370 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం 2022 జనవరిలో క్రీడా ప్రాంగణాలకు శ్రీకారం చుట్టింది. ఒక్కో క్రీడా ప్రాంగణానికి రూ.35 వేల నుంచి రూ.2 లక్షల వరకు వెచ్చించి ఏర్పాటు చేశారు. ప్రారంభించిన కొన్ని ప్రాంగణాల్లో మాత్రమే కొద్ది రోజులు ఆటలు ఆడారు. తదనంతరం ఎవరూ ఆ వైపు వెళ్లడం లేదు. దీంతో క్రీడా ప్రాంగణాలు అధ్వానంగా మారాయి. ఎక్కడ చూసినా ముళ్ల పొదలు, పిచ్చి మొక్కల మాటున పరికించి చూస్తే తప్ప గుర్తు పట్టే పరిస్థితి లేకుండా తయారయ్యాయి. అధికారులు బోర్డులు పెట్టి వదిలేశారు. ప్రాంగణాలను చదును చేసి ఆడుకునేందుకు వీలుగా మార్చకపోవడంతో యువతకు ఉపయోగ పడడం లేదు. సంబంధిత శాఖలు పర్యవేక్షించకపోవడమే ఇందుకు కారణం.
కుదించి కానిచ్చేశారు..
క్రీడా ప్రాంగణాలను ఎకరం స్థలానికి తక్కువ కాకుండా నిర్మించాలనే ప్రతిపాదనలున్నాయి. కానీ గ్రామాల్లో స్థలాల కొరత కారణంగా అధికారులు ప్రతిపాదనలు కుదించారు. పది గుంటల స్థలం లభించినా నిర్మాణాలు చేపట్టారు. ఇందులో తోరణం, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పిల్లర్ల కోసం రూ.55 వేలు వెచ్చించారు. స్థలాన్ని చదును చేసేందుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు మరికొన్ని నిధులను మంజూరు చేశారు. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎక్కడా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణం గ్రామానికి దూరంగా నిర్మించడంతో గ్రామస్తులు అక్కడికి వెళ్లలేకపోతున్నారు. ఎంపీడీఓలు, ఇతర అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఆయా గ్రామాల ప్రజలు వినియోగించుకోవడం లేదు. కొన్ని గ్రామాల్లో ధాన్యం ఆరబోసుకోవడానికి, ఇతర పనులకు క్రీడా ప్రాంగణాలను ప్రజలు ఉపయోగించుకుంటున్నారు.
స్పోర్ట్స్ కిట్లు ఎక్కడ?...
యువకులు, విద్యార్థులు ఆడుకునేందుకు వీలుగా గత ప్రభుత్వం జిల్లాలకు స్పోర్ట్స్ కిట్లు మంజూరు చేసింది. వాటిని మండల పరిషత్‌లలో భద్రపరిచారు. క్రికెట్, వాలీబాల్, డంబెల్స్, స్కిప్పింగ్ తాళ్లు, రింగ్ బాల్స్, టీషర్టులు పంపించారు. ప్రభుత్వం జిల్లాకు 700 కిట్లను పంపిణీ చేశారు. క్రీడా ప్రాంగణాలున్న పంచాయతీలకు పంపించాల్సి ఉండగా అవి ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. కొందరు మండల అధికారులు రాలేదని చెబుతుంటే, మరికొందరు పంచాయతీ కార్యదర్శులకు అందజేశామని చెబుతున్నారు. వీటిపై జిల్లా యువజన క్రీడల శాఖ అధికారులు దృష్టి సారించి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది.
వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కృషి
గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. వినియోగంలో లేని వాటిని, గ్రామ పంచాయతీలకు అందించిన క్రీడా పరికరాలను వినియోగంలోకి తీసుకువచ్చేలా కృషి చేస్తాం. యువత క్రీడా ప్రాంగణాలను, క్రీడా పరికరాలను సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తాం.
– ఆర్. పుల్లారావు, డీఎల్‌పీఓ, తొర్రూరు
మండలాలు–18 మున్సిపాలిటీలు– 5
గ్రామ పంచాయతీలు– 482
క్రీడా ప్రాంగణాలు– 370
ఒక్కో ప్రాంగణానికి వెచ్చించిన వ్యయం– రూ.35 వేలు–రూ.2 లక్షలు
ఆటలు ఆడలే..
ఆటలు ఆడలే..


