ప్రచారంలో మనోళ్లు!
సాక్షి, మహబూబాబాద్ : అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో మానుకోట జిల్లాకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొంటున్నారు. అక్కడ కూడా ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేయడం గమనార్హం.
తరలివెళ్లిన నాయకులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు జిల్లా నుంచి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు తరలి వెళ్లారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు బీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్ నాటి నుంచి అక్కడే ఉండి ప్రచారం చేస్తున్నారు. ఆయనతోపాటు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తోపాటు మహబూబాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, బీఆర్‌ఎస్ యూత్ విభాగం అధ్యక్షుడు యాళ్ల మురళీధర్ రెడ్డి ప్రచారంలో మునిగిపోయారు. రహమత్‌నగర్‌లోని వార్డుల్లో బీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి సీతక్క, విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బోరబండ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు. వారితోపాటు డోర్నకల్, మహబూబాబాద్, పాలకుర్తి, ములుగు నియోజకవర్గాల నుంచి ద్వితీయ శ్రేణి కార్యకర్తలు ప్రచారం కోసం తరలివెళ్లారు.
గిరిజన ఓటర్లపై ప్రభావం
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి అక్కడికి వెళ్లిన వారిలో ఎక్కువ శాతం గిరిజన లంబాడ తెగకు చెందిన నాయకులు ఉన్నారు. ఆ నియోజకవర్గంలో మొత్తం 4.50లక్షల ఓటర్లు ఉన్నారు. ఇందులో 30వేల వరకు లంబాడ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో అత్యధికంగా బంజారాహిల్స్, నందినగర్, చంద్రుతండా, బోరబండ, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో లంబాడ సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. వారి ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు శ్రమిస్తున్నారు.
ప్రచారం ముగిసే వరకు అక్కడే..
ఎన్నికలకు రెండు రోజుల ముందు వరకు అంటే నవంబర్ 9వ తేదీ వరకు జిల్లా నాయకులందరూ రాజధానిలోనే ఉండనున్నారు. వారికి కేటాయించిన వార్డుల్లో ఇతర కార్యకర్తలు, నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేయడం, ప్రతీ ఓటరును కలిసి ఓటు వేయాలని అభ్యర్థించాలని పార్టీ నాయకులు చెప్పడం, అలాగే మరికొందరు నాయకులకు టార్గెట్‌లు పెట్టి మరీ దింపడంతో ప్రచారం ముమ్మరమైంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో
జిల్లా నాయకులు
బోరబండ, రహమత్‌నగర్‌లో
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల
పోటాపోటీ ప్రచారం
ప్రచారంలో మనోళ్లు!


