భవనం.. శిథిలం | - | Sakshi
Sakshi News home page

భవనం.. శిథిలం

Nov 6 2025 9:22 AM | Updated on Nov 6 2025 9:22 AM

భవనం.

భవనం.. శిథిలం

మహబూబాబాద్‌: మానుకోట పట్టణంలోని జిల్లా అగ్నిమాపక కేంద్రం శిథిలావస్థ భవనంలో కొనసాగుతోంది. స్లాబ్‌ పెచ్చులు ఊడి పడుతున్నాయని, వర్షాలకు కార్యాలయంలోని ఫైళ్లు తడుస్తున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మిగిలిన రెండు అగ్నిమాపక కేంద్రాలకు భవనాలు లేవు. అలాగే కేసముద్రంలో కేంద్రం ఏర్పాటు కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది.

జిల్లాలో మూడు కేంద్రాలు..

మానుకోట పట్టణంలో జిల్లా అగ్నిమాపక కేంద్రంలో జిల్లా అగ్నిమాపక అధికారి, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, ఇద్దరు లీడింగ్‌ ఫైర్‌మెన్లు, ముగ్గురు డ్రైవర్లు, ముగ్గురు ఫైర్‌మెన్‌లు ఉన్నారు. మూడు ఫైరింజన్‌లు ఉన్నాయి. 25,000 లీటర్ల సామర్థ్యం గల సంప్‌ ఉంది. ఆ కార్యాలయ పరిధిలో మానుకోట, కురవి, బయ్యారం, గంగారం, కొత్తగూడ, గూడూరు, కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాలు ఉన్నాయి. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి.. స్లాబ్‌ దెబ్బతిని ఎప్పుడు కూలుతుందోనని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందికి సరిపోను గదులు లేకపోవడంతో పాటు వాహనాలకు షెడ్డు కూడా లేదు.

భవనాలు లేవు..

డోర్నకల్‌లో అగ్నిమాపక కేంద్రం ఉంది. కానీ సొంత భవనం లేదు. ప్రస్తుతం బీసీ వసతిగృహంలోని ఓ గదిలో కొనసాగుతోంది. అక్కడ ఎస్‌ఎఫ్‌ఓ, ఇద్దరు లీడింగ్‌ ఫైర్‌మెన్‌లు, ముగ్గురు ఫైర్‌మెన్‌లు, ఒక హోంగార్డు విధులు నిర్వర్తిస్తున్నారు. ఫైరింజన్‌ కండీషన్‌లో ఉన్నప్పటికీ సొంత భవనం లేక సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం స్థలం కేటాయించారని, త్వరలోనే భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని సిబ్బంది పేర్కొన్నారు. ఆ కేంద్రం పరిధిలో డోర్నకల్‌, గార్ల, సీరోలు మండలాలు ఉన్నాయి. అలాగే మరిపెడ తహసీల్దార్‌ కార్యాలయంలోని ఒక చిన్న గదిలో అవుట్‌పోస్ట్‌ అగ్నిమాపక కేంద్రం నిర్వహిస్తున్నారు. దానిలో పది మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ కేంద్రం పరిధిలో మరిపెడ, చిన్నగూడూరు, నర్సింహులపేట, తొర్రూరు, పెద్దవంగర మండలాలు ఉన్నాయి. ఈ రెండు కేంద్రాలకు ప్రధానంగా భవనాలు లేకనే సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.

వెంటాడుతున్న సిబ్బంది కొరత..

జిల్లాలోని మూడు అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉంది. జిల్లా కేంద్రంలోని ఫైర్‌స్టేషన్‌లో పది మంది ఫైర్‌మెన్‌లు ఉండాలి. కానీ, ముగ్గురు మాత్రమే ఉన్నారు. హోంగార్డులు పూర్తిస్థాయిలో లేరు. డోర్నకల్‌లో పది మంది ఫైర్‌ మెన్‌లకు.. ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లకు ఒక్కరు మాత్రమే ఉన్నారు. అలాగే మరిపెడ కేంద్రంలో కూడా పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు.

ప్రతిపాదనలతోనే సరి..

కేసముద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. అయితే నేటికీ మంజూరు కాలేదు. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటే వెంటనే ఫైర్‌స్టేషన్‌ మంజూరు అవుతుందని స్థానికులు కోరుతున్నారు.

కూలేదశలో జిల్లా ఫైర్‌స్టేషన్‌ కార్యాలయ భవనం

వర్షానికి తడుస్తున్న ఫైళ్లు

ఊడిపడుతున్న స్లాబ్‌ పెచ్చులు

బిక్కుబిక్కుమంటూ సిబ్బంది విధులు

మరో రెండు కేంద్రాలకు భవనాలు కరువు..

ప్రతిపాదనలకే పరిమితమైన కేసముద్రం సెంటర్‌

భవనం.. శిథిలం1
1/1

భవనం.. శిథిలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement