నియామకాలు ఎప్పుడో?
న్యూశాయంపేట : ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సుమారు 3 లక్షలకు పైగా మైనార్టీల జనాభా ఉంది. జిల్లాల విభజన చేసి ఎనిమిదేళ్లు దాటినా మైనారిటీ సంక్షేమ శాఖలో నేటికి ఆరు జిల్లాలో నాలుగింట్లో (జనగామ, ములుగు, జయశంకర్‌భూపాలపల్లి, మహబూబాబాద్) నేటికి ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతోంది. రెగ్యులర్ మైనారిటీ(డీఎండబ్ల్యూ) సంక్షేమాధికారుల నియామకం చేపట్టక పోవడంతో మైనారిటీల సంక్షేమం కుంటుపడుతోందని మైనార్టీ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కార్యాలయాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది లేకపోవడంతో ప్రభుత్వ పథకాల అమలు అటకెక్కింది. జిల్లా స్థాయిలో పటిష్టమైన యంత్రాంగం ఏర్పడితేనే ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మైనార్టీల విద్యా, ఆర్థికాభివృద్ధి, సామాజిక భద్రత పథకాలు విజయవంతంగా అమలవుతాయి.
సంక్షేమ పథకాలకు ఆటంకం..
మైనార్టీ వర్గాలకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆర్థికసాయం, వృత్తి శిక్షణ, షాదీముబారక్, ఇందిరమ్మ మహిళా యోజన, రేవంతన్న కా సహారా, టెమ్రిస్, ఓవర్‌సిస్ స్కీం (విదేశి విద్య) వంటి అనేక పథకాలు ఈ శాఖ ద్వారానే అమలు చేయాలి. అయితే ఆయా పోస్టుల ఖాళీలతో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లాలలో మైనార్టీ సంక్షేమాధికారుల తరఫున శాశ్వత అధికారులు లేకపోవడంతో ఇతర శాఖల ఉన్నతాధికారులు అదనపు బాధ్యతలు చూస్తున్నారు.క్షేత్రస్థాయిలో పనులు లబ్ధిదారులు వాటి పరిశీలన వంటివి నిలిచిపోతున్నాయని సంఘాల నేతలు వాపోతున్నారు. జనగామ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు ఒక్కరూ కూడా లేరు. జూనియర్ అసిస్టెంట్లు, డీఈఓలు ఒక్కొక్కరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆఫీస్ సబార్డినేట్ల ఊసే లేద. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక్క అధికారిని సైతం నియమించలేదు.
వరంగల్, హనుమకొండకు ఫారిన్ సర్వీస్ అధికారులు..
ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించారు. ఇందులో వరంగల్ డీఎండబ్ల్యూగా పంచాయతీ రాజ్ డిపార్ట్‌మెంట్, కో–ఆపరేటివ్ నుంచి ఫారిన్ సర్వీస్ అధికారి డీఎండబ్ల్యూగా, హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిగా వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను ఫారిన్ సర్వీస్‌లో డీఎండబ్ల్యూగా నియమించారు. మిగిలిన నాలుగు జిల్లాల్లో ఇన్‌చార్జ్ అధికారులే ఉన్నారు. జనగామ జిల్లాకు ఇన్‌చార్జ్‌గా డీఎండబ్ల్యూగా బీసీ వెల్ఫేర్ అధికారి, ములుగు జిల్లాకు ఇన్‌చార్జ్ డీఎండబ్ల్యూగా జిల్లా కో–ఆపరేటివ్ అధికారి, జయశంకర్ భూపాలపల్లి ఇన్‌చార్జ్ డీఎండబ్ల్యూగా జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి, మహబూబ్‌బాద్ జిల్లా ఇన్‌చార్జ్ డీఎండబ్ల్యూగా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు ఇటీవలే జిల్లా కలెక్టరేట్లలో పనిచేస్తే ఉర్దూ ఆఫీసర్లు జనగామ, ములుగు, భూపాలపల్లి, మహబూబ్‌బాద్ జిల్లాలలో పనిచేస్తున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాలలో తగినంత సిబ్బంది ఉన్నా, మిగితా నాలుగు జిల్లాల్లోని కార్యాలయాల్లో సిబ్బంది లేక ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నారు.
ఏళ్లు గడిచినా ఇన్‌చార్జ్‌ల పాలనే..
జిల్లాలు విభిజించి ఎనిమిదేళ్లు..
కుంటుపడుతున్న మైనార్టీల సంక్షేమం


