ఏటీఎంలో నగదు కొల్లగొట్టేందుకు యత్నం | - | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో నగదు కొల్లగొట్టేందుకు యత్నం

Oct 19 2025 6:49 AM | Updated on Oct 19 2025 6:49 AM

ఏటీఎం

ఏటీఎంలో నగదు కొల్లగొట్టేందుకు యత్నం

కాజీపేట: కాజీపేటలోని డీజిల్‌ కాలనీ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించి మిషన్‌ను ధ్వంసం చేశారు. ఏటీఎం మిషన్‌లో డబ్బులు ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించిన దుండగులు ముఖాలకు ముసుగులు ధరించి.. వెంట తెచ్చుకున్న ఆయుధాలతో మిషన్‌ను ధ్వంసం చేశారు. ఎంత ప్రయత్నించినా డబ్బులు బయటకు వచ్చే బాక్స్‌ మాత్రమే ఓపెన్‌ అయ్యింది. దీంతో దుండగులు కోపంతో మిషన్‌ను ఇష్టం వచ్చినట్లుగా ధ్వంసం చేసి నిరాశతో పరారయ్యారు. ఉదయం వేళ డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన వారు గమనించి 100 డయల్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి ఎస్‌బీఐ అధికారులతో పాటు సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సైలు లవన్‌కుమార్‌, శివ క్రైం పార్టీ సిబ్బందితో చేరుకుని ఆధారాల కోసం ప్రయత్నించారు. రహదారులపై ఉన్న సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. ఇది స్థానిక దొంగల పనేనా? లేక ఇతర ప్రాంతాలకు చెందినవారెవరైనా చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏటీఎంలో దాదాపు రూ.7లక్షల వరకు నిల్వ ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎస్‌బీఐ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

బైక్‌ అదుపు తప్పి వైద్యుడి మృతి

తరిగొప్పుల: బైక్‌ అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా ఒప్పిచెర్ల గ్రామానికి చెందిన మాచర్ల రవికిషోర్‌ (31) శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రవికిషోర్‌ గురువారం తన స్వగ్రామం ఒప్పిచెర్లకు వెళ్లి కారంపూడిలో కొత్త బైక్‌ కొన్నాడు. శుక్రవారం అదే బైక్‌పై తిరిగి మంచిర్యాలకు వస్తున్న క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి క్రాస్‌రోడ్‌ సమీపంలో మూలమలుపు వద్ద బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో అతడి తల, ఛాతీ భాగంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య హిమబిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కాసర్ల రాజయ్య తెలిపారు.

అప్పుల భారంతో

రైతు ఆత్మహత్య

పెద్దవంగర: భూ వివాదం, అప్పుల ఒత్తిడి తట్టుకోలేక మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామానికి చెందిన రైతు కూన నారాయణ (65) ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణ తనకున్న వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలం క్రితం తన భూమిలో కొంత భాగాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించాడు. రిజిస్ట్రేషన్‌ పూర్తి కాకపోవడంతో భూమి వివాదం కొనసాగుతోంది. భూ సమస్యలతో పాటు కుటుంబ అవసరాలకు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడంతో మానసికంగా ఆవేదనకు గురై పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు తొర్రూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచనల మేరకు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు శుక్రవారం మృతి చెందాడు. భార్య శశిరేఖ ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై ఎండీ హిదాయత్‌ అలీ తెలిపారు.

కూతురు పెళ్లి చూడకుండానే కానరాని లోకాలకు

వెంకటాపురం(ఎం): ఒక్కగానొక్క బిడ్డ పెండ్లి ఘనంగా చేద్దామనుకున్నాడు. ఎన్నెన్నో కలలు కన్నాడు. అందుకు తగిన ఏర్పాట్లలో లీనమయ్యాడు. ‘నవంబర్‌ 14న బిడ్డ పెళ్లి పెట్టుకున్న. తప్పక రావాలె. కార్డులు కొట్టిస్తాన. ఇంటికచ్చి పిలుస్త’ అని నవ్వుతూ కలిసిన వారందరికీ చెప్పుకున్నాడు. ఇంతలోనే కరెంటు తీగ ఆ తండ్రిని కాటేసింది. విద్యుత్‌ షాక్‌ రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. పెళ్లి జరగాల్సిన ఇంట విషాదం అలుముకుంది. వెంకటాపురం(ఎం) మండల కేంద్రానికి చెందిన రైతు కూరెళ్ల రాజయ్య(55) శనివారం విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. అతడికి ఇద్దరు సంతానం. కుమారుడు నరేశ్‌, కూతురు స్వాతి. బిడ్డ పెళ్లి చేసేందుకు నవంబర్‌ 7న నిశ్చితార్థం పెట్టుకున్నాడు. నవంబర్‌ 24న పెళ్లి తేదీని నిర్ణయించారు. ఏర్పాట్లలో భాగంగా మూడు రోజులుగా ఇంట్లో మరమ్మతులు చేయిస్తున్నాడు. అందులో భాగంగా.. శనివారం ఇంట్లోని వైర్లను సరిచేస్తున్న క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. మరికొద్ది రోజుల్లో వైభవంగా పెళ్లి వేడుకలు జరగాల్సిన ఇంట్లో తండ్రి ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నిండింది. కుటుంబ సభ్యులతో పాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

మిషన్‌ తెరుచుకోకపోవడంతో

దొంగలు పరార్‌

కరెంట్‌ షాక్‌తో తండ్రి మృతి

మిన్నంటిన కుటుంబీకుల రోదనలు

ఏటీఎంలో నగదు  కొల్లగొట్టేందుకు యత్నం1
1/3

ఏటీఎంలో నగదు కొల్లగొట్టేందుకు యత్నం

ఏటీఎంలో నగదు  కొల్లగొట్టేందుకు యత్నం2
2/3

ఏటీఎంలో నగదు కొల్లగొట్టేందుకు యత్నం

ఏటీఎంలో నగదు  కొల్లగొట్టేందుకు యత్నం3
3/3

ఏటీఎంలో నగదు కొల్లగొట్టేందుకు యత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement