
ముగిసిన నేషనల్ అథ్లెటిక్స్ మీట్
● హెప్టాథ్లాన్‌లో తెలంగాణకు గోల్డ్
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజుల పాటు కొనసాగిన జాతీయస్థాయి 5వ అథ్లెటిక్స్ అండర్–23 చాంపియన్‌షిప్ పోటీలు శనివారం ముగిశాయి. చివరి రోజు జరిగిన పలు ఈవెంట్లలో పతకాల కోసం అథ్లెట్లు పోటీపడ్డారు. పోటీల ఏర్పాట్లను తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె.సారంగపాణి, అధ్యక్షుడు స్టాన్‌లీజోన్స్, డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్ పర్యవేక్షించారు. పోటీల నిర్వహణలో టెక్నికల్ అఫీషియల్స్, కోచ్‌లు వాసుదేవరావు, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. చివరి రోజు జరిగిన పోటీల్లో మహిళల 800 మీటర్ల హెప్టాత్లాన్ విభాగంలో తెలంగాణ నుంచి కేతావత్ సింధు బంగారు పతకాన్ని సాధించింది.
రికార్డులు బ్రేక్
మూడు రోజుల పాటు జరిగిన ఈ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ మీట్‌లో పలువురు అథ్లెట్లు వివిద విభాగాల్లో పాత రికార్డులు బ్రేక్ చేసి కొత్త రికార్డులు సృష్టించారు. 100 మీటర్ల మహిళల విబాగంలో సుదీష్న హనమంత శివాంకర్ (మహారాష్ట్ర), 100 మీటర్ల మహిళల పరుగు విభాగంలో సాక్షి (గుజరాత్), డిస్కస్‌త్రో మహిళల కేటగిరీలో నిఖితకుమారి (రాజస్తాన్), పురుషుల 20వేల మీటర్ల రేస్‌వాక్‌లో సచిన్‌బొహారా(ఉత్తరాఖండ్), పురుషుల లాంగ్‌జంప్‌లో అనురాగ్ సీవీ (కేరళ), 400ల మీటర్ల పురుషుల హార్డిల్స్‌లో అర్జున్ ప్రదీప్ (కేరళ) కొత్త రికార్డులు సృష్టించారు. లాంగ్ జంప్ అనురాగ్ సీవీ తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. 2024లో తన పేరు మీద ఉన్న 7.87 మీటర్ల పాత రికార్డు 8.08 మీటర్లతో కొత్త రికార్డును సృష్టించాడు. కాగా 400ల మీటర్ల పురుషుల హార్డిల్స్ విభాగంలో కేరళకు చెందిన అర్జున్ ప్రదీప్ రికార్డు బ్రేక్ చేశాడు. 2022లో యాషెస్ (కర్ణాటక) 50.89 పేరున ఉన్న పాత రికార్డును అర్జున్‌ప్రదీప్ 50.29 స్కోర్‌తో రికార్డు సృష్టించాడు.

ముగిసిన నేషనల్ అథ్లెటిక్స్ మీట్