ఇన్‌చార్జ్‌లుగా పదోన్నతి..? | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జ్‌లుగా పదోన్నతి..?

Oct 16 2025 6:13 AM | Updated on Oct 16 2025 6:13 AM

ఇన్‌చార్జ్‌లుగా పదోన్నతి..?

ఇన్‌చార్జ్‌లుగా పదోన్నతి..?

టీజీ ఎన్పీడీసీఎల్‌లో పోస్టుల కల్పనకు యాజమాన్యం సన్నద్ధం

హన్మకొండ : తెలంగాణ నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీజీ ఎన్పీడీసీఎల్‌)లో పదోన్నతుల కల్పనకు యాజమాన్యం సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. పదోన్నతి అంశంపై హైకోర్టులో కేసు విచారణలో ఉండడంతో పాలన పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రెండేళ్ల నుంచి ఉన్నతస్థాయి పదోన్నతులకు అధికారులు సైతం ఎదురుచూస్తున్నారు. బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాలు హైకోర్టుకు వెళ్లడంతో ఎలాంటి పదోన్నతి కల్పించకుండా స్టే రావడంతో తాత్కాలిక పదోన్నతి ప్రక్రియకు ఆటంకం కలిగింది. ఎస్సీ, ఎస్టీలకు వారి రిజర్వేషన్‌ కోటాకు మించి పదోన్నతి పొందారని, తమకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల ప్రక్రియ సమీక్షించి న్యాయం చేయాలని కోరుతూ బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసు విచారణలో ఉండగా తాత్కాలిక పదోన్నతి కల్పిస్తుండడంతో బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాలు మరోసారి హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పు ఆలస్యమవుతుండడంతో పదోన్నతి ద్వారా భర్తీ చేయాల్సిన ఉన్నత స్థానాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాలనపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. మరో వైపు సీనియర్లు పదోన్నతి వైపు ఎదురుచూస్తు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో ఇన్‌చార్జ్‌ పదోన్నతి కల్పించాలని విద్యుత్‌ సంస్థల యాజ మాన్యాలు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఎన్పీడీసీఎల్‌లో ఇన్‌చార్జ్‌ పదోన్నతి కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. టీజీ ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌లో ఒకేసారి పదోన్నతి ఉత్తర్వులు అందించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

పెరిగిన పోస్టులు..

టీజీ ఎన్పీడీసీఎల్‌లో ఏళ్లుగా వినియోగంలో లేని 216 అన్‌యూజ్డ్‌ పోస్టులు, ఖాళీగా ఉంటున్న 217 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసి నూతనంగా 339 పోస్టులను మంజూరు చేసింది. దీంతో కొత్తగా రెండు చీఫ్‌ ఇంజనీర్‌, ఒక జాయింట్‌ సెక్రటరీ, సూపరింటెండ్‌ పోస్టులు 4, జనరల్‌ మేనేజర్‌ ఒక పోస్టు, డివిజనల్‌ ఇంజనీర్‌ పోస్టులు 4, సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులు 4, అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ పోస్టులు 6, అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఒక పోస్టు, అసిస్టెంట్‌ అకౌంట్‌ రెండు పోస్టు, పర్సనల్‌ ఆఫీసర్‌ 4, సబ్‌ ఇంజనీర్‌ 16 పోస్టులు, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ 16, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ 20, సీనియర్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ 32, సీనియర్‌ అసిస్టెంట్‌ 88, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ 48, ఆఫీస్‌ సబార్డినేట్‌ 80, వాచ్‌మెన్‌ 4, స్వీపర్‌ కమ్‌ గార్డెనర్‌, స్వీపర్‌, శానిటరీ ఆర్డర్లీస్‌ 6 పోస్టులు మంజూరయ్యాయి.

ఇంజనీరింగ్‌ విభాగంలో భారీగా పదోన్నతులు పొందే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎస్‌ఈలు నలుగురికి చీఫ్‌ ఇంజనీర్‌గా, ఐదునుంచి ఏడుగురు డీఈలకు ఎస్‌ఈలుగా, ఏడీఈలకు 7నుంచి 10మందికి డివిజన్‌ ఇంజనీర్లుగా, ఏఈలు 80 నుంచి 90 వరకు అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్లుగా పదోన్నతి లభించనుంది. వీటితో పాటు సబ్‌ ఇంజనీర్లకు ఏఈఈలుగా, సీనియర్‌ అసిస్టెంట్లకు జేఏఓలుగా, లైన్‌ ఇన్‌స్పెక్టర్లకు సీనియర్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్లుగా, జూనియర్‌ అసిస్టెంట్లకు సీనియర్‌ అసిస్టెంట్లుగా, పర్సనల్‌ ఆఫీసర్లకు అసిస్టెంట్‌ సెక్రటరీలుగా, అదే విధంగా అకౌంట్స్‌ విభాగంలోనూ పదోన్నతులు కల్పించనున్నారు. ఈ మేరకు ఎన్పీడీసీఎల్‌ మానవ వనరుల విభాగం ఇప్పటికే సీనియారిటీ, ఆర్‌ఓఆర్‌ ప్రకారం ఉద్యోగాల వారీగా పదోన్నతి జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ వారంలో ఎప్పుడైనా ఇన్‌చార్జ్‌ పదోన్నతుల ఉత్తర్వుల వెలువడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పూర్తిస్థాయి పదోన్నతికి అడ్డంకిగా హైకోర్టులో కేసు

ఖాళీగా ఉన్నతస్థాయి ఉద్యోగాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement