‘హైఫై’గా ఓరుగల్లు రైల్వే స్టేషన్
వరంగల్ రైల్వేస్టేషన్
సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునిక సదుపాయాలతో ప్రయాణికులకు సాదర స్వాగతం పలుకుతోంది. అమృత్‌భారత్ పథకంలోభాగంగా రూ.25.41కోట్ల వ్యయంతో కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఫలితంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఈ రైల్వే స్టేషన్‌లో కార్పొరేట్ సదుపాయాలు అందుబాటులోకి వ చ్చాయి. కాకతీయుల తోరణం, రెండు స్తంభాలపై రెండు ఏనుగులు, విశాలమైన ఫుట్‌ఓవర్ బ్రిడ్జి, శి ల్ప కళా సంపద ఉట్టిపడేలా ఎలివేషన్, ర్యాంపులు, ల్యాండ్ స్కేపింగ్, టికెట్ కౌంటర్, ప్లాట్‌ఫామ్ లతో పాటు గోడలకు ఇరువైపులా కళాకృకతులు, నూతన హంగులతో వెయిటింగ్ హాళ్లను తీర్చిదిద్దారు. ఫలితంగా ఐదేళ్ల క్రితం స్టేషన్‌లో ఉన్న సదుపాయాలతో పోలిస్తే ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీతోకూడిన అభివృద్ధితోపాటు సదుపాయాలు కల్పించారు.
స్వచ్ఛభారత్‌లో ఇప్పటికే ఉత్తమ అవార్డు..
వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి, ఆదాయంలో దూసుకెళ్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఉమ్మడి జిల్లాల ప్రజలు ఎక్కువ వరంగల్ రైల్వే స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యమినిస్తున్నారు. ఇందులో భాగంగా మూడు ప్లాట్ ఫామ్‌లతోపాటు స్టేషన్ పరిసరాలు పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నారు. ఈ చర్యలతో స్వచ్ఛ భారత్‌లో వరంగల్ రైల్వేస్టేషన్‌కు ఉత్తమ అవార్డు లభించింది. స్టేషన్ ఎదుట, ప్లాట్‌ఫామ్‌ల మధ్య పచ్చదనం కోసం గ్రీనరీ, పలు రకాల మొక్కలు పెంచుతున్నారు. వీటిని విధిగా సంరక్షిస్తుండడంతో రైల్వే స్టేషన్ ప్రాంగణం పచ్చగా కళకళలాడుతోంది.
ఏఏ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయంటే..
వృద్ధులు, మహిళలు, పిల్లలు మెట్లు ఎక్కడానికి, దిగడానికి ఇబ్బంది పడకుండా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు సౌకర్యాలు కల్పించారు.
ఒకటి, రెండు, మూడో నంబర్ ప్లాట్‌ఫామ్‌ల మధ్య ఆరు లిఫ్ట్‌లు, ఏడు ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా లగేజీతో వచ్చే ప్రయాణికులకు ఇవి ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి.
రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై మినరల్ వాటర్ లీటర్ కేవలం రూ.5కే సరఫరా చేస్తున్నారు. ప్లాట్ ఫామ్‌లపై పలుచోట్ల మొబైల్ ఫోన్ల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు.
ప్రయాణికులకు ఇంటర్నెట్ కోసం వైఫై సదుపాయం అందుబాటులోకి తెచ్చారు.
ప్రయాణికులకు వీవీఐపీ, ఏసీ, నాన్ ఏసీ వెయింటింగ్ హాళ్లు, ప్లాట్‌ఫామ్‌పై స్టీల్ కుర్చీలు, గద్దెలు, సిమెంట్ బెంచీలు, విశాలమైన టికెట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.
స్టేషన్ ఆవరణ, ప్లాట్‌ఫామ్‌లు పరిశుభ్రంగా ఉంచడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఇందులోభాగంగా ప్రయాణికులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పలు చోట్ల డస్ట్ బిన్లు అందుబాటులో ఉంచారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు రుచికరమైన భోజనంతోపాటు రైల్ కోచ్‌లో ఆహారం తిన్నామన్నా అనుభూతి కలిగించేలా రైల్ కోచ్ హోటల్‌నే ఏర్పాటుచేశారు. సమీప ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో పాటు సిటీవాసులు ఇక్కడ రుచికరమైన టీ,టిఫిన్, భోజనం చేసి ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు రైల్వే స్టేషన్ ఎదుట గార్డెనింగ్, పురాతన డీజిల్ రైలు ఇంజన్ చూస్తూ సేదదీరుతూ కనిపిస్తున్నారు.
ఓవైపు కాకతీయ కళావైభవం.. ఇంకోవైపు కార్పొరేట్ హంగులు
ప్రయాణికులకు అందుబాటులో ఏసీ, నాన్ ఏసీ వెయింటింగ్ హాళ్లు
లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ర్యాంపులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి
రూ.5కే మినరల్ వాటర్
ఇంటర్నెట్ కోసం వైఫై..
పరిశుభ్రత, పచ్చదనానికి ప్రాధాన్యం
ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతోంది..
వరంగల్ రైల్వేస్టేషన్‌కు ప్రతీరోజు సుమారు 24 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరి ద్వారా వార్షిక ఆదాయం 2024–2025లో సుమారు రూ. 82 కోట్లు ఉంది. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని ఇంకా పెంచుకునే దిశగా ఆలోచించి ప్రయాణికులకు కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించాం. ఇందులోభాగంగా స్టేషన్ ప్రాంగణంలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, వైఫై, టికెట్ బుకింగ్ కౌంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతీ ప్లాట్‌ఫామ్‌పై లిఫ్ట్, ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేశాం. స్టేషన్ ప్రధాన ప్రవేశ మార్గాన్ని, రిజర్వేషన్ టికెట్ బుకింగ్ కౌంటర్లను అధునాతనంగా తీర్చిదిద్దాం. ఇక్కడి నుంచి ఉన్నత శ్రేణి తరగతుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
– సారయ్య, స్టేషన్ మేనేజర్, వరంగల్
వావ్.. వరంగల్
వావ్.. వరంగల్
వావ్.. వరంగల్
వావ్.. వరంగల్
వావ్.. వరంగల్