
చిన్న తగాదా ప్రాణం తీసింది
జనగామ: రిమాండ్ ఖైదీ.. టాయిలెట్‌లో ఉన్న బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లికి చెందిన వారాల మల్లయ్య (42), అదే గ్రామానికి చెందిన పడకంటి బ్రహ్మచారి మధ్య గత నెల 23వ తేదీన స్నేహపూరిత వాతావరణంలో చిన్న తగాదా చోటు చేసుకుంది. ఆ ఘటనలో మల్లయ్య కర్రతో కొట్టగా, బ్రహ్మచారి చెయ్యి విరగడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి మల్లయ్యను ఈ నెల 8వ తేదీన కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో మల్లయ్యను అదే రోజు సాయంత్రం జనగామ సబ్‌జైల్‌కు పంపించారు. చిన్న తగాదాకు పోలీసులు కేసు నమోదు చేసి తనను జైలుకు పంపించారని మల్లయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నాలుగు రోజులుగా సబ్‌జైలులో ఉంటున్న మల్లయ్య ఈ నెల11వ తేదీన ఉదయం అందరి ఖైదీల్లాగే టిఫిన్ చేసేందుకు బయటకు వచ్చాడు. అనంతరం సబ్‌జైలు ప్రాంగణంలో ఉన్న టాయిలెట్‌లోకి వెళ్లి అందులో ఉన్న బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్వయంగా జైలు అధికారులకు చెప్పాడు. వెంటనే జైలు అధికారులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (సుమారు మధ్యాహ్నం 12.40 నిమిషాలకు)కి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల12న మృతి చెందాడు.
సబ్ జైలు ఎదుట ఆందోళన..
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బాధితులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో సబ్ జైలు ఎదుట ఆందోళన చేపట్టారు. రూ.50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుడికి భార్య హైమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
విచారణకు రానున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం
జనగామ సబ్ జైలులో రిమాండ్ ఖైదీ మృతి ఘటనలో నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) బృందం ఆధ్వర్యంలో విచారణ జరుపనున్నారు. ఇందుకు సంబంధించి వారికి లేఖ సైతం వెళ్లినట్లు సమాచారం.
సబ్ జైలులో బ్లీచింగ్ పౌడర్ తాగిన రిమాండ్ ఖైదీ
చికిత్స పొందుతూ మృతి