
294 వైన్స్.. 258 దరఖాస్తులు!
కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్‌కు దరఖాస్తు చేసేందుకు మద్యం వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 11 వరకు 294 వైన్స్‌కు కేవలం 258 దరఖాస్తులు రావడం గమనార్హం. సగటున ఒక వైన్స్‌కు ఒక దరఖాస్తు కూడా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం వైన్స్ టెండర్ల దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచింది. దీంతో మద్యం వ్యాపారులు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. మరో వైపు దీపావళి బాణసంచా అమ్మే వ్యాపారుల్లో సగం మంది మద్యం వ్యాపారం చేస్తారు. రూ.3 లక్షలు పెట్టి బాణసంచా విక్రయిస్తే రూ.6 లక్షలు వస్తాయి కదా.. ఇక మద్యం దరఖాస్తులు ఎందుకు అని వారు అనుకుంటున్నట్లు సమాచారం. కాగా, మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. వైన్స్‌కు బదులు ఓటర్లకు సమర్పించుకుంటే ఎన్నికల్లో నైనా నెగ్గుతామంటూ దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు.
23న లక్కీడ్రా..
వైన్స్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 18 చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దరఖాస్తుకు గడువు 6 రోజులు మాత్రమే మిగిలింది. అక్టోబర్ 23వ తేదీన లక్కీ డ్రా ద్వారా వైన్స్ కేటాయిస్తారు. 2023–25లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15,926 దరఖాస్తులకు రూ.318 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ, ఈసారి 30 వేల దరఖాస్తులు, రూ.500 కోట్ల ఆదాయం రావాలని పెట్టుకున్న టార్గెట్‌ను కనీసం చేరుకుంటారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఏ జిల్లాలోనూ సెంచరీ దాటని అర్జీలు
రూ.3 లక్షల ఫీజు, దీపావళి, స్థానిక ఎన్నికల ఎఫెక్ట్
దరఖాస్తు చేసుకోవడానికి మిగిలింది ఇక 6 రోజులే
ఉమ్మడి వరంగల్ జిల్లాలో
వైన్స్‌లు, దరఖాస్తుల వివరాలు..
జిల్లా వైన్స్ దరఖాస్తులు
వరంగల్ అర్బన్ 67 89
వరంగల్ రూరల్ 57 49
జనగామ 50 34
మహబూబాబాద్ 61 57
భూపాలపల్లి 59 29