
సికింద్రాబాద్–కాజీపేట మధ్య 3వ, 4వ రైల్వేలైన్
110 కి.మీ నిర్మాణానికి రంగం సిద్ధం
రూ.2,837 కోట్ల వ్యయ అంచనా
కాజీపేట రూరల్ : రైల్వేశాఖ సికింద్రాబాద్–కాజీపేట మధ్య 3వ, 4వ రైల్వే లైన్ నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రూ.2,837 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ (ఘట్‌కేసర్) నుంచి కాజీపేట వరకు 110 కి.మీ.తో మేడ్చల్, యాదాద్రి, జనగామ, హనుమకొండ జిల్లాలను కలుపుతూ 3వ, 4వ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే బల్లార్షా నుంచి కాజీపేట వరకు అక్కడక్కడ చిన్న చిన్న బిట్ వర్క్స్ తప్ప 3వ లైన్ నిర్మాణం పూర్తయ్యింది. కాజీపేట–సికింద్రాబాద్ మధ్య 3వ లైన్ కావాల్సి ఉంది. కొత్తగా చేపట్టనున్న 3, 4వ లైన్ నిర్మాణ ప్రాజెక్ట్ కాలం 4 ఏళ్లు పట్టనుంది. ముఖ్యంగా ఈ మార్గంలో బొగ్గు, సిమెంట్ ఉత్పత్తి రవాణాలో రైళ్ల ట్రాఫిక్ తగ్గుతుంది. ప్రస్తుతం 110 కి.మీ.వేగంతో రైళ్లు వెళ్తుండగా, 3, 4వ రైల్వే లైన్ మార్గాలు పూర్తయితే గంటకు 130 కి.మీ.వేగంతో రైళ్లు ప్రయాణించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు ప్రస్తుతం సికింద్రాబాద్–కాజీపేట వరకు ఉన్న రైళ్ల సమయంలో అరగంట తగ్గుతుందని భావిస్తున్నారు.