
యువకుడికి పాముకాటు..
● చికిత్స పొందుతూ మృతి
బచ్చన్నపేట : పాముకాటుతో చికిత్స పొందుతున్న ఓ యువకుడు శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని బోనకొల్లూర్ గ్రామానికి చెందిన దయ్యాల పద్మ–కనకయ్య దంపతుల కుమారుడు రాకేశ్ (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ నెల 4వ తేదీన వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన రాకేశ్‌కు పాముకాటు వేసింది. అయితే పాము కనిపించకపోవడంతో తేనెటీగ కుట్టిందని అదే రోజు గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జనంలో పాల్గొని భోజనం చేసి పడుకున్నాడు. మరుసటి రోజు కాలు తిమ్మిరిగా ఉండడంతో జనగామ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో బాధిత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.