
మధ్యవర్తిత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్ రూరల్ : కక్షిదారులు మధ్యవర్తిత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా కోర్టులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో జూలై 1నుంచి సెప్టెంబర్ 30వరకు నిర్వహించిన 90 రోజుల మీడియేషన్ క్యాంపెయిన్ విజయవంతమైందన్నారు. 90 రోజుల్లో జిల్లాలోని వివిధ న్యాయస్థానాలు 56 కేసులను మధ్యవర్తిత్వానికి నివేదించగా 14 కేసులు ఇరుపక్షాల రాజీతో పరిష్కారమయ్యాయని తెలిపారు. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం కూడా ఒక ప్రత్యామ్నాయ వేదిక అని కక్షిదారులకు తెలియజేయడంలో క్యాంపెయిన్ సఫలీకృతమైందన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన న్యాయవాదులు చెన్నమల్లారెడ్డి, కృష్ణ, చిన్నమహేందర్, సుభాష్, హరికృష్ణ, రఘునాథరావు, సైదులు, శ్రీనివాస్ మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. 90 రోజుల క్యాంపెయిన్ విజయవంతానికి సహకరించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.