
ప్రాణాల మీదికి తెచ్చిన యూరియా
● యూరియా కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
● గాయపడిన రైతులు.. ఆస్పత్రుల్లో చికిత్స
బయ్యారం: యూరియా రైతుల ప్రాణాల మీదికి తెస్తోంది. జిల్లాలో ఇటీవల యూరియా కోసం వాహనంపై వెళ్తూ ఇద్దరు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, తాజా గా యూరియా కోసం వెళ్తూ ఆటో ప్రమాదంలో రైతులకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని గురిమెళ్ల గ్రామానికి చెందిన రైతులకు ఉప్పలపాడులో సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం యూరియా పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. కాగా, గరిమెళ్ల గ్రామానికి చెందిన బోడ అశోక్ తన ఆటోలో 12 మందిని తీసుకొని ఉప్పలపాడుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మహబూబాబాద్ మండలం కంబాలపల్లి సమీపంలోని వాగు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న రైతులు బోడ కిషన్, వజ్జ సూరమ్మ, బోడ లక్ష్మి, మాలోత్ లక్ష్మి, మాలోత్ మంగమ్మ, మాలోత్ కవిత, గలిగి సారమ్మ, మాలోత్ భీముడు, మాలోత్ వస్య, వజ్జ బుచ్చయ్య, బోడ విజయకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనాల్లో మానుకోటలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కాగా, క్షతగాత్రులను పలువురు పరామర్శించారు.

ప్రాణాల మీదికి తెచ్చిన యూరియా