
పోష్ చట్టంపై మహిళలకు అవగాహన అవసరం
● ఎంపీ కడియం కావ్య
హన్మకొండ చౌరస్తా: మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం(పోష్)పై మహిళలు అవగాహన కలిగి ఉండాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో మహిళా సాధికారతపై జరుగుతున్న పార్లమెంటరీ కమిటీ పోష్ అమలు– 2014 అంశంపై ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కావ్య పాల్గొని మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన కావ్య
సీఎం రేవంత్‌రెడ్డిని వరంగల్ ఎంపీ కడియం కావ్య హైదరాబాద్‌లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాజీపేట రైల్వేస్టేషన్ ఎదుట చేపట్టనున్న మల్టీ మోడల్ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. భూపాలపల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడంతోపాటు భూపాలపల్లికి దగ్గరగా ఉన్న ఉప్పల్, కమలాపూర్ స్టేషన్లకు అనుసంధానించేలా రైల్వే లైన్ నిర్మాణం అంశాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకురావాలని రేవంత్‌రెడ్డిని కోరారు. ‘కుడా’ను సంప్రదించకుండానే 2014 మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా చింతలపల్లి నుంచి నష్కల్, హసన్‌పర్తి రెండు కొత్త రైల్వే లైన్లు ప్రతిపాదించారని తెలిపారు. అంతేకాకుండా చారిత్రక భద్రకాళి, వేయిస్తంభాలగుడి, బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి ప్రసాద్ పథకానికి సహకరించాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.