
అక్షరాస్యతతోనే సమాజాభివృద్ధి
మహబూబాబాద్ అర్బన్: అక్షరాస్యతతోనే సమాజం అభివృద్ధి దిశగా పయనిస్తుందని డీఈఓ దక్షిణామూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ అక్షరాస్యత ముగింపు వారోత్సవ ర్యాలీ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు అక్షరాస్యులు కావాలని, తద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు సమాన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విద్య అనేది వ్యక్తిని మాత్రమే కాదు, మొత్తం సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి అని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు అక్షరాస్యత సాధనలో భాగస్వాములు కావాలని, అక్షరాస్యతను ఒక సామూహిక ఉద్యమంలా మార్చాలని పిలుపునిచ్చారు. ఏఎంఓ చంద్రశేఖర్ అజాద్, డీఎస్‌ఓ అప్పారావు, ఏపీఎం శంకర్ నాయక్, డీడీ ధనరాజు, రిసోర్స్ పర్సన్లు నాగముణి, వీరన్న, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వలంటీర్లు పాల్గొన్నారు.
సృజనాత్మకతను వెలికితీయొచ్చు..
కళా–ఉత్సవ్ పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఎంతగానో దోహదపడుతాయని డీఈఓ దక్షిణామూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో సోమవారం జిల్లా స్థాయి కళా–ఉత్సవ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో కళాత్మక నైపుణ్యాలను వెలికితీసే మంచి వేదిక కళా ఉత్సవ్ అన్నారు. వాయిద్య పోటీలు, గ్రూప్ డ్యాన్స్, భరత నాట్యం, ఏకపాత్రాభినయం, బొమ్మల తయారీ పోటీలు, చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఏసీజీఈ మందుల శ్రీరాములు, ఏఎంఓ ఆజాద్ చంద్రశేఖర్, డీఎస్‌ఓ అప్పారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.