
నిమజ్జనానికి వచ్చి మృత్యుఒడికి..
మంగపేట: మండలంలోని బ్రాహ్మణపల్లిలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా బ్యాండ్ కొట్టేందుకు వచ్చిన గార అంజన్న(54) ప్రమాదవశాత్తు నీటి మడుగులో పడి మృతి చెందాడు. ఎస్సై టీవీఆర్ సూరి కథనం ప్రకారం.. శుక్రవారం గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి వాజేడు మండలం ధర్మారం నుంచి పలువురు బ్యాండ్ వాయిద్య కళాకారులు వచ్చారు. కార్యక్రమం ముగిసిన అనంతరం అంజన్న కనిపించకపోవడంతో అతడి కోసం శనివారం ఉదయం వరకు వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో ఇంటికి వెళ్లి ఉంటాడని భావించారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం గ్రామంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ రోడ్డు పక్కన ఉన్న నీటి మడుగులో అంజన్న మృతదేహం తేలి కనిపించింది. మూత్ర విసర్జనకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి మడుగులో పడి మృతి చెంది ఉండొచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నీటి మడుగులో పడి వాయిద్య కళాకారుడి మృతి