మొరాయిస్తున్న ఈవీ బస్సులు
హన్మకొండ : సాంకేతిక సమస్యలు, నిర్వహణ లోపంతో ఎలక్ట్రిక్ బస్సులు మొరాయిస్తున్నాయి. నెలలో 90నుంచి 95 బ్రేక్‌డౌన్లు, మరమ్మతులతో ఆర్టీసీకి గుదిబండగా మారాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈక్రమంలోనే ప్రధానమంత్రి ఈ–బస్ సేవా పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థకు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది. ఆర్టీసీ యాజమాన్యం వరంగల్ రీజియన్‌కు 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా వీటిని వరంగల్–2 డిపో ద్వారా నడుపుతోంది. వీటికి ప్రత్యేకంగా విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణంతోపాటు చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను ఈ ఏడాది జనవరి 6వ తేదీన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ ప్రారంభించారు. బస్సులు ప్రారంభం నుంచి ఫెయిల్యూర్స్‌తో టీజీఎస్ వరంగల్ రీజియన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
రోజుకు 3నుంచి 4 బ్రేక్‌డౌన్లు
ప్రతీ రోజు 3నుంచి 4 బస్సులు బ్రేక్‌డౌన్ అవుతున్నాయి. ఒక్క ఆగస్టులోనే 95 బస్సులు బ్రేక్‌డౌన్ అయ్యాయంటే ఈవీ బస్సుల వైఫల్యానికి అద్దం పడుతోంది. ఇందులో కొన్ని ప్రమాదాల కారణంగా నిలిచిపోయినవి కూడా ఉన్నాయి. రోజుకు 15వేల కిలోమీటర్లు రద్దు చేసుకోవాల్సి వస్తోందని, క్వాలిఫైడ్ మ్యాన్‌పవర్ లేకపోవడం వల్ల ఈ దుస్థితి నెలకొందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. జేబీఎం కంపెనీ వారికి చెప్పినా ఫలితం లేదని అధికారులు పేర్కొంటున్నారు. సాంకేతిక సమస్యలు, ప్రతి దానికి సెన్సార్లు ఏర్పాటు చేయడంతో చిన్నపాటి తేడా వచ్చినా బస్సు ముందుకు కదలదు. దీంతోపాటు చాసిస్ క్రాక్ రావడం, సస్పెన్షన్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బస్సులు ప్రారంభించిన 270 రోజుల్లో దాదాపు 810కి పైగా బ్రేక్‌డౌన్లు కావడం చూస్తే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సెన్సార్లు, ఇతర సాంకేతిక సమస్యలతోపాటు చార్జింగ్ సమస్య ఎలక్ట్రిక్ బస్సులను వేధిస్తోంది.
బస్సుల నిర్వహణను చూస్తున్న జేబీఎం సంస్థకు నైపుణ్యం కలిగిన మెకానిక్‌లు లేకపోవడం, సిబ్బంది కొరతతో రోజుల తరబడి బస్సులు మరమ్మతుకు నోచుకోక నిలిచిపోతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల మరమ్మతులపై అనుభవం లేకపోవడంతో కంపెనీ ప్రతినిధులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ బస్సుల సరఫరా నిర్వహణను జేబీఎం ఆటో లిమిటెడ్ అనుబంధ సంస్థ జేబీఎం ఎకోలైఫ్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వం అప్పగించింది. మొత్తం 112 బస్సుల్లో సూపర్ లగ్జరీ–21, డీలక్స్–22, ఎక్స్‌ప్రెస్ బస్సులు–69 ఉన్నాయి. వీటిని హనుమకొండ నుంచి హైదరాబాద్, నిజామాబాద్, ఏటూరునాగారం, సూర్యాపేట, సిద్దిపేట, కాళేశ్వరం, ఖమ్మం రూట్లలో తిప్పుతున్నారు.
ఆర్టీసీకి గుదిబండగా మారిన వైనం
కాలుష్యాన్ని తగ్గించేందుకు వరంగల్ రీజియన్‌కు 112 బస్సుల కేటాయింపు
జేబీఎం సంస్థ నిర్వహణ..
తరచూ బ్రేక్‌డౌన్
రోజుకు 15వేల కిలోమీటర్లు రద్దు
మొరాయిస్తున్న ఈవీ బస్సులు


