
ఆ నలుగురు లేక..
ఆగస్టు 28వ తేదీన మరిపెడకు చెందిన భద్రయ్య వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. రెండ్రోజుల అనంతరం చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడి కోసం ఎవరైనా వస్తారేమోనని వారంపాటు మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఎవరూ రాకపోవడంతో స్వచ్ఛంద సంస్థ సహాయంతో అంత్యక్రియలు చేశారు.
కాజీపేట : ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకై నా లేడు మానవత్వం ఉన్నవాడు ’అంటూ ఓ సినీకవి అన్నట్లు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవ చేయలేక కొందరు, మంచాన పడితే సపర్యలు చేయాల్సి వస్తోందని మరికొందరు, అంత్యక్రియల ఖర్చు భరించలేక ఇంకొందరు.. కార ణం ఏదైనా కన్నపేగుకు చివరి మజిలీ చేయకుండా వదిలించుకుంటున్నారు. ఆస్పత్రులు, రోడ్ల వెంట, ఆశ్రమాల్లో అనాథ శవాలుగా మారడంతో స్వచ్ఛంద సంస్థలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి.
వైద్యంపేరుతో వదిలించుకుంటున్నారు
దీర్ఘకాల వ్యాధులు, వృద్ధాప్యంతో బాధపడేవారిని ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రులకు తీసుకొచ్చే క్రమంలో కొందరు వివరాలు నమోదు చేయకుండానే వార్డుల్లో చేర్చి వెళ్లిపోతున్నారు. సపర్యలు చేసేవారు లేక మల,మూత్ర విసర్జనలు మంచంలోనే చేస్తుండటంతో ఇతర రోగులకు ఇబ్బంది కలుగుతోంది. వారికి ఆయా వార్డుల్లో పనిచేసే సిబ్బందే సేవలు చేయాల్సి వస్తోంది. ఆస్పత్రులు, వృద్ధాశ్రమాల్లో వృద్ధులను చేరుస్తున్న వారిలో కొందరు పేర్లు, సెల్‌ఫోన్ నంబర్లు రాస్తున్నారు. తర్వాత ఫోన్ చేస్తుంటే అందులో నిజాలు ఉండడం లేదని వైద్యులు, ఆశ్రమాల నిర్వాహకులు చెబుతున్నారు. ధర్మసాగర్ మండలం సాయిపేటకు చెందిన ఓ వృద్ధురాలిని కాజీపేట రైల్వే జంక్షన్ ప్రాంతంలో వదిలేసి వెళ్లి పోయారు. స్థానికులు చేరదీసి దగ్గరలోని సహృదయ అనాథ ఆశ్రమంలో చేర్పించారు. వివరాలు తెలుసుకుని కుమారులు, కుమార్తెలకు సమాచారం ఇచ్చినా వచ్చి తీసుకెళ్లని పరిస్థితి.
8నెలల్లో 58 మంది..
జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి నేటివరకు ప్రభుత్వ ఆస్పత్రులు, రోడ్ల పక్కన, అనాథ ఆశ్రమాల్లో కలిపి 58మంది వరకు మృతిచెందారు. పత్రికలు, అధికారులు, ఆస్పత్రి వర్గాల ద్వారా సమాచారం తెలుసుకొని వారికి స్వచ్ఛంద సంస్థలు అంత్యక్రియలు నిర్వహించాయి. రహదారుల పక్కన గుర్తు తెలియని మృతదేహాలు కనిపిస్తే పోలీసులకు చుక్కలు కనిపిస్తాయి. వాటిని మార్చురీల్లో భద్రపర్చడం ఒక ఎత్తు అయితే.. గుర్తించడం వేచి ఉండి అంత్యక్రియలు సొంత ఖర్చులతో చేయడం తలకు మించిన భారంగా మారుతోంది.
కాజీపేట రైల్వే జంక్షన్ సమీపంలో ఇటీవల ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని పత్రిక ప్రకటన విడుదల చేసి మూడ్రోజులు శవాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఎవరూ రాకపోవడంతో స్వచ్ఛంద సంస్థ సహాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇలా అనేక మంది వృద్ధులకు వృద్ధాశ్రమాల నిర్వాహకులే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
అయినవారితో
అంత్యక్రియలకు నోచని అనాథలు
పోలీసులు, అనాఽఽథాశ్రమ
నిర్వాహకులకు భారం