
బైక్ అదుపు తప్పి ప్రైవేట్ అధ్యాపకుడి దుర్మరణం
● మరొకరికి తీవ్ర గాయాలు
హసన్‌పర్తి : బైక్ అదుపు తప్పిన ఘటనలో ఓ ప్రైవేట్ అధ్యాపకుడు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కేయూ–కాజీపేట ప్రధాన రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ నాయక్ (25) నగరంలోని ఓ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్‌లో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే ఇనిస్టిట్యూట్‌లో మహారాష్ట్రకు చెందిన రోహన్ కూడా అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. కాగా, గురువారం సహా అధ్యాపకుడి ఇంట్లో జరిగిన విందుకు ఇద్దరు హాజరై, తిరిగి బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు. ఈక్రమంలో కేయూ–కాజీపేట ప్రధాన రోడ్డులోని తులసీబార్ సమీపంలో ప్రధాన రహదారిపై బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో శ్రీకాంత్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన రోహన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై నవీన్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. బాధితకుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.