
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మామునూరు: వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన గుండల కృష్ణ(45) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో పనికి వెళ్లి తిరిగి రాత్రి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ముస్కులపల్లి బొడ్రాయి సమీపంలో వరంగల్ –ఖమ్మం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీ సడెన్ బ్రేక్ వేయగా.. వెనుక ఉన్న బైక్.. లారీని ఢీకొంది. దీంతో బైక్‌పై నుంచి రోడ్డు మీద పడిన కృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని హుటాహుటిన 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి తల్లి గుండల అమృతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మామునూరు ఇన్‌స్పెక్టర్ రమేశ్ తెలిపారు. కాగా, ఘటనా స్థలిని వరంగల్ ఈస్ట్ జోన్‌డీసీపీ అంకిత్ కుమార్ పరిశీలించారు. ప్రమాద స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఇన్‌స్పెక్టర్ రమేశ్, ఎస్సైలు కృష్ణవేణి, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
జ్వరంతో మహిళ మృతి
వెంకటాపురం(కె): జ్వరంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కమ్మరిగూడెంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పర్శిక అరుణ(31) జ్వరంతో బాధపడుతూ మూడురోజుల క్రితం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందింది. అయినా తగ్గకపోవడంతో ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీ జ్వరంగా నిర్ధారించి చికిత్స చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం జ్వరం ఎక్కువ కావడంతో వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి