
అదనపు కట్నం వేధింపులు..
● భర్తకు ఏడాది జైలు
వరంగల్ లీగల్ : అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేసిన ఘటనలో నేరం రుజువుకావడంతో భర్తకు ఏడాది జైలు శిక్ష, రూ.18 వేలు జరిమానా విధిస్తూ హనుమకొండ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాంతిసోని గురువారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన దొనికల అనూషకు భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన గుడ్డేటి దిలీప్‌కుమార్‌తో 2020, నవంబర్ 11న వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.40 లక్షలు, 30 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. వివాహ అనంతరం కొద్ది రోజులు బాగానే చూసుకున్న దిలీప్‌కుమార్ కుటుంబీకులు తక్కువ కట్నం తెచ్చావంటూ అనూషను వేధించసాగారు. ఈ క్రమంలో ఉద్యోగ రీత్యా దిలీప్‌కుమార్.. భార్య అనుషాతో కలిసి 2021, జూలై 27న అమెరికా వెళ్లాడు. అక్కడ కూడా రూ. కోటి అదనపు కట్నం తీసుకురావాలని, లేనిపక్షంలో విడాకులు ఇస్తానని బెదించాడు. దీంతో అనూష.. దిలీప్‌కుమార్‌పై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మందలించి వదిలేశారు. అనంతరం 2022, జూలై 30న అనూష, దిలీప్‌కుమార్ ఇండియాకు తిరిగొచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లిన దిలీప్‌కుమార్ తల్లిదండ్రులు అనూషను తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యలో అనూష తల్లిదండ్రులు తాత్కాలికంగా ఉంటున్న ఘట్‌కేసర్ వద్ద ఆమెను వదిలి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అనూష ప్రశ్నించడంతో ఆమె తల్లిదండ్రుల ఎదుటే ‘నీకు విడాకులు ఇస్తా’ అని చెప్పి దిలీప్‌కుమార్‌తోపాటు కుటుంబీకులు స్వగ్రామం వచ్చారు. ఈ విషయంపై అనూష తల్లిదండ్రులు పంచాయితీ నిర్వహించగా విడాకులు తీసుకుంటానని దిలీప్‌కుమార్ పెద్దల సమక్షంలో చెప్పాడు. దీంతో చేసిదేమీ లేక అనూష మహిళా పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో జడ్జి శాంతిసోని.. నేరస్తుడు దిలీప్‌కుమార్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.18 వేల విధిస్తూ తీర్పు వెలువరించారు.