క్షతగాత్రులకు అంబులెన్స్‌ల సేవలు
సకాలంలో ఆస్పత్రికి తరలించి, వైద్య సహాయం
నెహ్రూసెంటర్: రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్ సేవలు సంజీవనిగా మారుతున్నాయి. ఫోన్ రాగానే అంబులెన్స్ పైలెట్లు, ఈఎంటీలు వెంటనే స్పందించి ఆపదలో ఉన్నవారికి సకాలంలో వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నారు. కాగా, జిల్లాలో 21అంబులెన్స్‌లు, ఏడు 102 వాహనాలు, ఒక పార్థివ వాహనం, 3 పశుసంచార వాహనాలు, అత్యాధునిక నియోనెటల్ అంబులెన్స్ ప్రజలకు అందుబాటులోకి రాగా.. సేవలు అందుతున్నాయి. కాగా, మండలానికి ఒకటి చొప్పున అంబులెన్స్‌లు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
గర్భిణులు, బాలింతలకు..
ప్రమాదాలకు గురైన వారితో పాటు అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారికి, గర్భిణులు, బాలింతలకు సైతం వైద్య సేవలు అందించేలా తోడ్పాటునందిస్తున్నారు. జూలై నుంచి ఇప్పటి వరకు సమారు 4వేల మందికి పైగా క్షతగాత్రులు, వైద్య సహాయం అవసరమైనవారు, గర్భిణులు, బాలింతలకు అంబులెన్స్ సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. కాగా, పురిటి నొప్పులతో గర్భిణులు అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగిన సంఘటనలు ఉన్నాయి.
సురక్షితంగా..
రోడ్డు ప్రమాదాల బాధితులను అంబులెన్స్‌లో వెంటనే ఆస్పత్రులకు తరలించడం, గర్భిణులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లడం, బాలింతలను ఆస్పత్రి నుంచి ఇంటికి సురక్షితంగా తరలిస్తున్నారు. గత ఏడాదిగా 108 అంబులెన్స్‌ల ద్వారా 17,339మంది, 102 వాహనం ద్వారా 16,704 మందికి సేవలు అందించారు. హలో అంటే.. మేమున్నామంటూ ఆపదలో ఆపన్నహస్తం అందిస్తూ వైద్య సేవలు సకాలంలో అందించడంతో ప్రాణాలు నిలబడేలా చొరవ తీసుకుంటున్నారు. ముఖ్యంగా గోల్డెన్ అవర్‌ను దృష్టిలో పెట్టుకుని సత్వర చర్యలు చేపడుతున్నారు.
రెండు నెలల్లో అంబులెన్స్‌ల ద్వారా తరలించిన బాధితులు
నెల క్షతగాత్రులు గర్భిణులు, బాలింతలు
మే 19 44 14 69
జూన్ 20 27 21 37