
విధుల్లో చిత్తశుద్ధితో పనిచేయాలి
కేసముద్రం: అధికారులు విధుల్లో చిత్తశుద్ధితో పని చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. గురువారం ఇనుగుర్తి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాల, ఎస్సీ బాలుర హాస్టల్, పీహెచ్‌సీ, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్‌సీ పరిధిలోని సబ్‌సెంటర్ల వారీగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, అవసరం ఉన్నచోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, మాతా, శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా భూభారతి, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాల పరిసరాలను పరిశీలించి, మెనూ ప్రకారంగా భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ బాలుర హాస్టల్‌లో సౌకర్యాలను పరిశీలించారు. ఇదే హాస్టల్ భవనంలో తాత్కాలికంగా నడుస్తున్న ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ తరంగిణి, ఎంపీడీఓ హరిప్రసాద్, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో