
న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్ రూరల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న లోక్ అదాలత్, ఉచిత న్యాయ సేవలను కక్షిదారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.శాలిని అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో కక్షిదారులు, న్యాయవాదులతో న్యాయ చైతన్య సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఖర్చులేని సులభమైన పరిష్కార ప్రక్రియ లోక్ అదాలత్ అన్నారు. అదేవిధంగా ఇంతకుముందు కోర్టు వరకు రాని వివాదాలను న్యాయ సేవాధికార సంస్థ ప్రీ లిటిగేషన్ విధానంలో పరిష్కరిస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆంగ్ల భాషలో వెలువరించిన తీర్పులను కృత్రిమ మేధ పద్ధతి ద్వారా ప్రాంతీయ భాషలోనికి అనువదించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఉన్నత న్యాయస్థానాల తీర్పులు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ అవకాశాన్ని న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి.నాగేశ్వరరావు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ టి.సునీత తదితరులు పాల్గొన్నారు.