
పూడికతీత పనుల్లో ఆలస్యం
బయ్యారం: జిల్లాలో ప్రధాన సాగునీటి వనరైన బయ్యారం పెద్దచెరువు అభివృద్ధిపై పాలకులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువు నిండే వరకు ప్రేక్షకపాత్ర పోషించి.. ఆ తర్వాత కాల్వల పూడికతీత పనులు చేపడుతున్నారు. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో నాట్లు దేవుడెరుగు వరినారును కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది. కాగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గత నెల 27న చెరువు తూములను ఓపెన్ చేశారు. కాగా తూములు తెరిచి 11రోజులైనా బయ్యారం వరకు చెరువు నీరు చేరలేదు. సకాలంలో నాట్లు వేసుకుందామంటే నత్తనడకన సాగుతున్న కాల్వల పూడికతీత పనులతో వరినార్లు ముదిరి దిగుబడి తగ్గే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు.
ఒకే పొక్లెయినర్‌తో ఎన్నిరోజులు..
బయ్యారం పెద్దచెరువు ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగు నీరందించేందుకు పెద్దకాల్వ, తునికికాల్వ, పెరుగుబుడ్డి, గుండ్లోరి కాల్వలు ప్రధానమైనవి. ఈ కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి బలహీనంగా ఉన్న చోట కట్టలు పటిష్టం చేసేందుకు నీటిపారుదలశాఖాధికారులు టెండర్ ద్వారా పనులు ప్రారంభించారు. సుమారు 12 కిలోమీటర్ల పొడవు ఉండే కాల్వల పూడికతీతకు కనీసం మూడు పొక్లెయినర్‌లు ఏర్పాటు చేస్తే త్వరితగతిన పనులు పూర్తయ్యేవి. అయితే ప్రస్తుతం ఒకే మిషన్‌తో పనులు చేపడుతుండడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్న మిషన్‌తో పాటు మరో మిషన్ ఏర్పాటు చేసి త్వరితగతిన పూడికతీత పనులు చేపట్టాలని, సకాలంలో సాగునీరు అందించాలని అధికారులను కోరుతున్నారు.
వృథాగా సాగునీరు..
తూములు తెరిచినప్పటికీ కాల్వల పూడికతీత వల్ల నీటి ప్రవాహం ముందుకు సాగడం లేదు. దీంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఇదిలా ఉండగా అలుగు ద్వారా వెళ్లే నీరు వృథా అవుతోంది. ఆ నీటిని ఆయకట్టుకు మళ్లీంచే అవకాశం లేకపోవడంతో అలిగేటిలో కలిసిపోతోంది.
నీళ్లు వస్తే నాట్లు పడేవి..
చెరువు కాల్వలను ఇంతక ముందే బాగు చేస్తే చెరువు నిండిన వెంటనే పంట పొలాలకు నీళ్లు వచ్చేవి. అలుగు ద్వారా ఏటిలో పడుతున్న నీటిని కాల్వలకు విడుదల చేస్తే మా పొలాల్లో నాట్లు పడేవి. మా గుండ్లోరి కాల్వ బాగు చేసి చివరన ఉన్న బంజరతండాకు ఎప్పుడు నీరు ఇస్తారో తెలియని పరిస్థితి ఉంది.
– బి.బిచ్చ, బంజరతండా
ఏటా సీజన్ ప్రారంభంలో బయ్యారం చెరువు కాల్వల మరమ్మతు
11రోజులక్రితం తూములు
తెరిచిన ఎమ్మెల్యే
బయ్యారం వరకు చేరని సాగునీరు
ఎండుతున్న వరినారు మడులు

పూడికతీత పనుల్లో ఆలస్యం

పూడికతీత పనుల్లో ఆలస్యం