
యూరియా వచ్చిందయా !
ఖిలా వరంగల్: యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరట లభించింది. మంగళవారం మధ్యాహ్నం వరంగల్ రైల్వేస్టేషన్‌లోని గూడ్స్‌షెడ్‌కు వ్యాగన్ చేరింది. ఉమ్మడి జిల్లాలోని రైతులకు అందించేందుకు ఆర్‌సీఎఫ్ కంపెనీకి చెందిన యూరియా 1,319.220 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఈ యూరియాను మార్క్‌ఫెడ్‌కు 60శాతం, ఇతర ఫర్టిలైజర్స్‌కు 40శాతం కేటాయించారు. మార్క్‌ఫెడ్ అధికారులు ప్రధానంగా ఎక్కడ కొరత ఉందో ఆ ప్రాథమిక సహకార సంఘాలకు లారీల్లో తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ సీజన్‌లో కావాల్సిన యూరియా మొత్తంలో 60శాతం పైగా ఇప్పటికే చేరింది. తాజాగా వచ్చిన దానితో సమస్యలు తీరినట్లేనని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. రైతులు యూరియా దొరకదనే ఆపోహలకు గురికాకుండా ఒకటి, రెండు బస్తాలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. వీటి అమ్మకాలు పూర్తయితే మరింత వచ్చే వీలుందని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులున్నా మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. దాదాపు అన్ని మండలాల్లో తగినన్ని నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఒకేసారి కొనుగోలు చేయడం, కొనుగోలు చేసిన మొత్తాన్ని ఒకేసారి చల్లలేరని, తీసుకున్న యూరియాను పంటకు ఎక్కువగా చల్లడం వల్ల నష్టాలు వస్తాయని చెప్పారు. రైతులు ఎకరానికి 25 కిలోలకు మించి వినియోగించొద్దని అధికారులు సూచించారు.
రైల్వే గూడ్స్‌షెడ్‌కు చేరిన యూరియా వ్యాగన్
ఉమ్మడి జిల్లాకు 1,319.220 మెట్రిక్ టన్నులు కేటాయింపు
అన్ని మండలాల్లో తగినంత యూరియా ఉంది: అధికారులు