
టీవీ రిపేర్ పేరుతో ఇంట్లో చోరీ
నడికూడ: టీవీ మరమ్మతు చేస్తానంటూ వచ్చి ఓ ఇంట్లో దొంగతనం చేసిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోల్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరకాల ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాలీబ్ రాజు తన భార్యతో సోమవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. ఇంటివద్ద ఉన్న తల్లిదండ్రుల వద్దకు 11 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ‘మీ కొడుకు టీవీ రిపేరు చేయమన్నాడు..’ అని చెప్పి ఇంట్లోకి వెళ్లాడు. టీవీ గదిలో ఉన్న బీరువా తాళం పగలకొట్టి రూ.లక్షా 38 వేల విలువ గల రెండు బంగారు ఉంగరాలు, ఒక జత కమ్మలు, మాటీలు, బంగారు చైన్, వెండి పట్టగొలుసు, నగదు రూ.11,000 చోరీ చేసి.. టీవీ రీపేర్ పూర్తయ్యిందని చెప్పి వెళ్లిపోయాడు. 20 నిమిషాల అనంతరం రాజు తల్లిదండ్రులు ఇంటి లోపలికి వెళ్లిచూడగా బీరువా పగలగొట్టి ఉండడం గమనించి తమ కుమారుడికి సమాచారం ఇచ్చారు. బాధితుడు రాజు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.