
‘ఆరు’లోనే అర్హురాలైందట..!
● ఇందిరమ్మ ఇంటి కోసం వెళ్లిన మహిళకు వింత అనుభవం
బయ్యారం: ఆరో తరగతి చదువుతున్న సమయంలో ఇందిరమ్మ ఇంటికి అర్హులరాలిని చేయడమే కాకుండా ఆమె పేరున రూ.22,350 నగదును ఖాతాలో జమ, రూ.7,500విలువైన సిమెంట్ బస్తాలు ఇచ్చినట్టు రికార్డుల్లో వెలుగు చూసింది. ఈ ఘటన బయ్యారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. మండలంలోని బాలాజీపేటకు చెందిన గుగులోత్ లాలు కుమార్తె బేబి 2008వ సంవత్సరంలో ఆరో తరగతి చదివింది. 2014లో బేబికి బాల్యాతండాకు చెందిన వినోద్‌తో వివాహం జరిపించారు. బాల్యాతండాలో రేకుల ఇంట్లో ఉంటున్న బేబి కుటుంబం ఇటీవల ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంది. ఇంటి మంజూరుకు అన్ని అర్హతలు బేబికి ఉన్నప్పటికీ గృహనిర్మాణశాఖ వెబ్‌సైట్‌లో ఆమె ఫొటోతో చూపెడుతున్న వివరాలు ఇంటి మంజూరుకు అడ్డుగా మారాయి. 2008లో బేబి పేరున ఇల్లు మంజూరు కావడంతో పాటు గంధంపల్లిలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో రూ.22,350 నగదు ఖాతాలో జమచేసినట్లు, రూ.7,500 విలువైన 50 సిమెంట్‌కట్టలు ఇచ్చినట్టు రికార్డులో ఉంది. చదువుకుంటున్న సమయంలో తనకు ఇల్లు ఇచ్చినట్టు రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేయటం ఏమిటని బేబి వాపోతోంది. తన ఆధార్‌కార్డు ఫొటోను జగ్గుతండాకు చెందిన గుగులోత్ బేబి, హచ్చ పేరుకు అనుసంధానం చేసి ఇల్లును మంజూరైనట్టు గృహనిర్మాణశాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేశారని, తనకు ఇల్లు మంజూరు చేయాలని బేబి పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులను కలిసి వేడుకుంది. నాటి అధికారులు చేసిన తప్పుకు తాను బలవుతున్నానని, ఇప్పటికై నా అధికారులు పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది.