
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ తిరుపతిరావు
మహబూబాబాద్ రూరల్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ ఎన్.తిరుపతిరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. టౌన్ ఎస్సై కె.శివ సిబ్బందితో కలిసి నర్సంపేట బైపాస్‌లో వాహనాల తనిఖీ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి అనుమానాదాస్పదంగా కనిపించాడు. దీంతో పోలీసులు అతడిని ఆపగా, పారిపోయేందుకు యత్నించడంతో అదుపులోకి తీసుకుని విచారించి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా (రాజమహేంద్రవరం జిల్లాకేంద్రం) గోకవరం మండలం ఎస్సీపేట దేవీచౌక్ గ్రామానికి చెందిన గొర్రెల చిన్నబాబుగా గుర్తించారు. చిన్నబాబు గత మే 31వ తేదీన డోర్నకల్‌లో ఓ బైక్, మహబూబాబాద్‌లోని రామచంద్రాపురంలో 4.5 గ్రాముల బంగారు, 8 గ్రాముల వెండి ఆభరణాలు, ఆర్టీసీ కాలనీలో 4 గ్రాముల వెండి ఆభరణాలు చోరీకి పాల్పడగా ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వాటితోపాటు నర్సంపేట, కోదాడ పట్టణాల్లో కూడా రెండు చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీసీఎస్ సీఐ హతీరాం, రూరల్ సీఐ, టౌన్ ఇన్‌చార్జ్ సీఐ సర్వయ్య, ఎస్సై ప్రశాంత్, సివిల్, సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.