
బోదకాలు నివారణకు చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్: బోదకాలు నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్పరెన్స్ హాల్‌లో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సంబంధిత సిబ్బందితో బోదకాలు నివారణ, జాతీయ నులిపురుగుల దినోత్సవంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా లెనిన్ వత్సల్ టోప్పో మాట్లాడుతూ... జాతీయ కీటకజనిత వ్యాధుల నియంత్రణ, బోదకాలు నివారణ కార్యక్రమంపై ఈనెల 10 నుంచి 25 వరకు ప్రత్యేక కార్యచరణ తయారు చేయాలన్నారు. జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు సన్నాహక సమావేశాలు నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ప్రత్యేకంగా అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ పాఠశాలలో, మోడల్ స్కూల్స్‌లో కార్యచరణ నిర్వహించి ఆ తేదీల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వాలని టామ్ టామ్ నిర్వహించి కళా జాత బృందాలతో విస్త్రతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులలో అక్రమ లింగనిర్దారణ పరీక్షలు స్కానింగ్‌లు చేయకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్, డీఈఓ రవీందర్‌రెడ్డి, అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో