
ఎండు గంజాయి పట్టివేత
చిన్నగూడూరు: అక్రమంగా తరలిస్తున్న 12.440 కేజీల ఎండు గంజాయిని పట్టుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఎస్సై వెల్లడించిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం శివారు జయ్యారం క్రాస్ రోడ్డు సమీపంలో సోమవారం సాయంత్రం పోలీస్ సిబ్బందితో వాహనాల తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు బ్లూ కలర్ సూట్‌కేస్‌తో ఆటోకోసం ఎదురుచూస్తున్నారు. వారిని, వారి వద్ద ఉన్న సూట్‌కేస్‌ను తనిఖీ చేయగా సుమారు రూ.6 లక్షలు విలువ చేసే 12.440 కేజీల ఎండు గంజాయిని గుర్తించినట్లు తెలిపారు. వారిని విచారించి మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన పిట్టల రమేష్, కురవి మండలంలోని సూదనపల్లి గ్రామానికి చెందిన ఎలమశెట్టి సాయికుమార్, మొగిలిచర్ల శివారు జగ్యాతండాకు చెందిన లునావత్ సుమన్ కలిసి ఎండు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని తమకు గుర్తు తెలియని వ్యక్తి పంపించాడని విచారణలో తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి గంజాయి సీజ్ చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ముగ్గురిలో ఇద్దరు అధికార పార్టీకి చెందిన నాయకులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
రూ.6 లక్షల విలువ చేసే
గంజాయి స్వాధీనం