
అప్రమత్తతే ఆయుధం..
మహబూబాబాద్ రూరల్ : పంటలపై పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో రైతులు, వ్యసాయ కూలీల ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది. పురుగు మందులు అత్యంత ప్రమాదకరం. ఈ క్రమంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణానికే ముప్పు అని గుర్తించాలి. పురుగు మందులు శరీరంలోకి వెళ్లినా, వాసన పీల్చినా ఆరోగ్యానికి హానికరం. రైతులు వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటలకు కలుపు, చీడపీడల నివారణకు పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. పంటకు హాని జరుగుతుందన్న ఏమరుపాటులో జాగ్రత్తలు తీసుకోవడం మరచిపోతున్నారు. ఈ క్రమంలో ప్రాణాంతక రసాయన మందుల వినియోగం విషయంలో ఏమరుపాటు వద్దని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.
పరిమితికి మించి వినియోగం హానికరం..
పంటను ఆశించిన తెగుళ్లు, పురుగుల నిర్మూలనకు ఇష్టమొచ్చిన పురుగు మందులు చల్లితే ఉపయోగం ఉండదు. విష తీవ్రతలో తేడా ఉంటుంది. పిచికారీ చేసేసమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అస్వస్థతకు గురవుతారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, ఫెస్టిసైడ్స్ దుకాణాదారుల సూచనలు పాటించాలి. పరిమితికి మించి పంటలకు మందులు పిచికారీ చేస్తే మేలుకన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. జాగ్రత్త వహించకుంటే పంటకు మేలుచేసే సాలీడు, అక్షింతల పురుగులు మృత్యువాతపడతాయి. మిత్ర పురుగులు పొలంలో లేకుంటే పంటకు హానిచేసే పురుగుల ఉధృతి పెరుగుతుంది.
అవసరమైన పరికరాలు వాడాలి..
పంటలకు పురుగుమందులు వాడడానికి వ్యవసాయశాఖ సూచించిన స్ప్రేయర్లనే వాడాలి. ముఖ్యంగా పంటలో మొక్కల స్థాయిని బట్టి స్ప్రేయర్లు ఉపయోగించాలి. పత్తిలో హ్యాండ్ స్ప్రేయర్, పవర్ స్ప్రే యర్ల కంటే తైవాన్ స్ప్రేయర్ల ద్వారా మొక్కలకు నేరుగా మందు పిచికారీ చేసే వీలుంటుంది. చేతులకు గ్లౌజ్‌లు, కళ్లద్దాలు, ముఖానికి మాస్క్, తలకు టోపీ లేదా రుమాలు తప్పనిసరిగా ధరించాలి. చేతి వేళ్లకు గోళ్లు పెంచుకోకూడదు. పత్తిలో అయితే కాళ్లకు బూట్లు ధరించాలి. ఉదయం, సాయంత్రం గాలి ఎదురుగా వచ్చేటప్పుడు పురుగుమందు పిచికారీ చేయొద్దు. గాలి వీస్తున్న వైపే వెళ్తూ పిచికారీ చేయాలి. పురుగు మందు పిచికారీ సమయంలో పొగ తాగొద్దు. పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు తినొద్దు. చేతులు నోట్లో పెట్టుకోవడం, కళ్లు నలుచుకోవడంలాంటి పనులు అస్సలు చేయొద్దు.
స్ప్రేయర్‌తోనే పిచికారీ చేయాలి..
● పంట ఏపుగా ఉంటే చేతిపంపుతో కాకుండా స్ప్రేయర్ తోనే పిచికారీ చేయాలి. కొన్ని రకాల పురుగుమందులు మాత్రం పవర్ స్ప్రేయర్‌తో పిచికారీ చేయొద్దు. స్ప్రేయర్‌తో పిచికారీ చేస్తే మందు గాలిలో కలిసి ఇతర పంటలపై పడితే వంట నాశనమై పోతుంది. అందుకే వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి. అలాగే, గాయాలైన చేతులతో మందు పిచికారీ చేయొద్దు. పిచికారీ పూర్తయిన వెంటనే కాళ్లు, చేతులు సబ్బుతో కడుక్కోవాలి. తలస్నానం చేయాలి.
● పిచికారీ చేసే సమయంలో ప్రత్యేక దుస్తులు మా త్రమే ధరించాలి. వాటిని విడిచిన తర్వాత మిగతా దుస్తులతో కలిపి ఉతకొద్దు. పిల్లలకు పురుగుమందులను సాధ్యమైనంత దూరంగా ఉంచేలా జాగ్రత్త పడాలి. పిచికారీ అనంతరం వినియోగించిన పురుగు మందు డబ్బాలను గోతి తీసి పాతిపెట్టాలి.
పురుగు మందులపై అవగాహన ఉండాలి
పంటలను ఆశించే చీడపీడల నివారణకు ఉపయోగించే పురుగు మందులపై రైతులు అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా ఫెస్టిసైడ్ దుకాణాల్లో పురుగు మందులు నాలుగు రంగుల్లో లభ్యమవుతాయి. వీటిలో పుర్రె గుర్తుతో ఉన్న రంగు, ఆకుపచ్చ, నీలి, పసుపు రంగులతో కూడిన డబ్బాలు ఉంటాయి. పుర్రె గుర్తుతో కూడి ఎర్ర రంగు ఉంటే అత్యంత విషపూరితమని గుర్తించాలి. ఆకుపచ్చ రంగు చిహ్నంతో ఉంటే తక్కువ విషపూరితమని తెలుసుకోవాలి.
బి.క్రాంతికుమార్,
కోఆర్డినేటర్, మల్యాల కేవీకే
నిర్లక్ష్యం వహిస్తే ప్రాణానికే ముప్పు
పురుగు మందుల పిచికారీలో
ఏమరుపాటు వద్దు
రైతులకు అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు

అప్రమత్తతే ఆయుధం..

అప్రమత్తతే ఆయుధం..