
ముగ్గురు నకిలీ వైద్యులపై కేసు
నెక్కొండ: వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని ముగ్గురు నకిలీ వైద్యులపై కేసు నమోదు చేసినట్లు టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..గత మే 22న స్థానిక రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ రుద్ర, లావణ్య, అమ్మ ఆస్పతుల్లో డీఎంహెచ్‌ఓ సాంబశివరావు తనిఖీలు చేపట్టిన విషయం తెలి సిందే. ఎటువంటి అర్హతలు లేకుండా ఆదర్శ వైద్యులుగా చెప్పుకుంటూ, క్లినిక్స్ నిర్వహిస్తున్నారని ఆ యన పేర్కొన్నారు. ప్రథమ చికిత్స కేంద్రాల ముసుగులో అశాసీ్త్రయ పద్ధతులలో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, నొప్పి ఇంజెక్షన్లు వేయడం, ల్యాబ్ టెస్ట్‌లు నిర్వహించడం, సైలెన్లు పెట్టడం, ఆస్పత్రిలో బెడ్స్ ఏర్పాటు చేయడం వంటివి చేయడం ఆయా తనిఖీల్లో వెలుగులోకి వచ్చిందన్నారు. కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ డి.లాలయ్యకుమార్, చైర్మన్ డాక్టర్ కె.మహేశ్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఎన్‌ఎంసీ చట్టం 34, 54, టీఎస్‌ఎంపీఆర్ చట్టం 22, బీఎన్‌ఎస్ 318, 319 ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నకిలీ వై ద్యులు లావణ్య ఫస్ట్‌ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు ఎం.రమేశ్, రుద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్ బి.రవి, అ మ్మ ఫస్ట్‌ఎయిడ్ సెంటర్ డి.అశోక్‌పై కేసు నమోదు చేసినట్లు డాక్టర్ నరేశ్‌కుమార్ పేర్కొన్నారు.
రేపటి వరకు సైన్స్ కాంగ్రెస్ రిజిస్ట్రేషన్ గడువు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈనెల 19, 20, 21వ తేదీల్లో తెలంగాణ అకాడమీ సైన్స్, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా తెలంగాణ సైన్స్‌కాంగ్రెస్ నిర్వహించనున్నాయి. సైన్స్‌కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు అధ్యాపకులు, పరిశోధకులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 5 వరకు గడువు పొడిగించినట్లు తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, కేయూ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి.వెంకట్రామ్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఇప్పటివరకు సైన్స్‌కాంగ్రెస్‌కు 658 అబ్‌స్ట్రాక్ట్‌లు రాగా 476మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన తెలిపారు.
పేలిన లారీ టైరు..
● అక్కడికక్కడే డ్రైవర్ మృతి
● వంగపహాడ్ సమీపంలో ఘటన
హసన్‌పర్తి: టైరును పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు పేలింది. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం యాదాద్రి–ఆరెపల్లి జాతీయ రహదారి మార్గమధ్యలోని వంగపహాడ్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన పి. సాయిలు(40) షాబాద్ బండల లోడ్ లారీతో జాతీయ రహదారిపై ములుగు వైపునకు బయలుదేరాడు. అయితే వంగహాడ్ సమీపంలో లారీ ఆపి టైరును పరిశీలిస్తుండగా ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ముగ్గురు నకిలీ వైద్యులపై కేసు