
ఇల్లు, పింఛన్ ఇస్తేనే కిందికి దిగుతా!
మరిపెడ రూరల్: ఇందిరమ్మ ఇల్లు, పింఛన్ ఇవ్వలేదని ఓ వ్యక్తి సెల్‌టవర్ పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాసనపల్లి రాములు అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు లిస్టులో పేరు వచ్చింది. అయినా తనకు ఇల్లు మంజూరు చేయలేదని, అలాగే తనకు కన్ను కనిపించడం లేదని, దానికి పింఛన్‌కు దరఖాస్తు పెట్టుకున్న ఇవ్వడం లేదని రాములు ఆరోపించాడు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఇల్లు, పింఛన్ మంజూరు కాకపోవడంతో మనస్తాపం చెందిన రాములు గ్రామ శివారులో ఉన్న సెల్‌టవర్ పైకి నిరసన వ్యక్తం చేశాడు. గంట దాటినా అతడు సెల్‌టవర్ దిగకపోవడంతో అక్కడికి పెద్దసంఖ్యలో స్థానికులు చేరుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి రాములుకు నచ్చజెప్పారు. ఆదివారం కావడంతో అధికారులు ఎవరూ రారని, సోమవారం మాట్లాడి ఇల్లు, పింఛన్ మంజూరు చేయిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించి కిందకు దిగాడు. ఈ విషయంపై గ్రామ కార్యదర్శి మౌనికను వివరణ కోరగా..రాములకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైన విషయం వాస్తవమేనని, కానీ ఇంటి స్థలం విషయంలో వారి అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండటంతో పెండింగ్‌లో పెట్టినట్లు తెలిపారు. అన్నదమ్ములు ఇంటి స్థలం పంచుకున్న తర్వాత రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తామని రాములుకు చెప్పినట్లు కార్యదర్శి పేర్కొన్నారు.
లిస్ట్‌లో పేరున్నా
మంజూరు చేయడం లేదని ఆరోపణ
తానంచర్లలో సెల్‌టవర్ ఎక్కి
వ్యక్తి నిరసన
అధికారులతో మాట్లాడి మంజూరు చేయిస్తామని నచ్చజెప్పిన పోలీసులు

ఇల్లు, పింఛన్ ఇస్తేనే కిందికి దిగుతా!